ఒకప్పటి స్టార్స్ అయిన స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ... ఇలా వీరందరూ ఎక్కువ చిత్రాలు చేసేవారు. కానీ కాలానుగుణంగా వస్తున్న మార్పులు, సినిమాల విషయంలో తొందరపడకుండా ఒక సినిమా తర్వాత మరో సినిమా చేసే కాలం ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక మన తాజా సీనియర్‌స్టార్స్‌లో చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఏడాదికి ఐదారు చిత్రాలు చేసేవాడు. దాంతో ఆయన నేటి సీనియర్స్‌లో ఏకంగా 150 చిత్రాలను పూర్తి చేయగలిగాడు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఒకప్పుడు ఆయన కూడా వరుస చిత్రాలు చేశాడు. దాంతో తాజాగా ఆయన 100 చిత్రాలను పూర్తి చేయగలిగాడు. ఇక మరో సీనియర్ కింగ్ నాగార్జున కూడా సెంచరీకి చేరువలోకి వచ్చాడు.
ఆయన నటించిన అతిధి పాత్రలను కూడా లెక్కలోకి తీసుకుంటే ఆయన కూడా సెంచరీకి మరో రెండడుగుల దూరంలో ఉన్నాడు. కానీ ఆయన సోలో హీరోగా చేసిన చిత్రాలు 85కి అటుఇటుగా ఉన్నాయి. దాంతో ఈమధ్య ఆయనే స్వయంగా తానే తన వందో చిత్రం ఏమిటి? ఎందుకు? అనే లెక్కలు తేల్చిచెబుతానన్నాడు. తాను చేయబోయే 'బంగార్రాజు' చిత్రం తనకు వందో చిత్రం కాదని, ఈ విషయంలో తన లెక్కలు తనకు ఉన్నాయని తెలిపాడు. ఏదిఏమైనా అతి త్వరలోనే నాగ్ సెంచరీని కొట్టడం ఖాయమైంది. ఇక నాగ్‌కు కాస్త అటు ఇటుగా కెరీర్‌ను ప్రారంభించిన మరో సీనియర్ స్టార్ వెంకీ మాత్రం ఈ విషయంలో కాస్త వెనుకబడే ఉన్నాడు.
త్వరలో ఆయన 75వ చిత్రంలో నటించనున్నాడు. మరి విక్టరీ వెంకీ కూడా తన కెరీర్‌లో భవిష్యత్తులోనైనా సెంచరీకి చేరువకాగలడా? ఆయన అభిప్రాయం ఏమిటో? అని చాలా మంది ఆయన ఈ విషయంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడా? అని ఎదురుచూస్తున్నారు. సో.. ఈ విషయంపై వెంకీ స్పందించేదాకా మనం ఏదీ తేల్చిచెప్పలేం. ఇక నేటి యంగ్‌స్టార్ అయిన పవన్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్.. ఇలా ఎవ్వరూ సెంచరీ చేరువ కావడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి. అందుకే పెద్దలు చెప్పినట్లు 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అనే వాక్యాన్ని మనం ఒప్పుకోవాలి.