పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు ప్రేక్షకులలోనే కాదు.. సినిమా ఫీల్డ్‌లో కూడా వీరాభిమానులున్న సంగతి తెలిసిందే. వీరిలో ఆలీ, నితిన్, సప్తగిరి వంటి అనేకులున్నారు. తాజాగా పవన్ చాలా లేటుగా కమెడియన్ శ్రీనివాసరెడ్డి నటించిన 'జయమ్ము .. నిశ్చయంబురా' చిత్రం చూసి శ్రీనివాసరెడ్డి నటనా విలక్షణతను మెచ్చుకుంటూ ఆయనకు ఫ్లెవర్‌బోకేతోపాటు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక విషయానికి వస్తే దర్శకుడు సంపత్‌నంది దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టి ఏడేళ్లయింది. ఈ చిన్న సమయంలోనే ఆయన పడటం, లేవడం...తిరిగి పరుగెట్టడం వంటివి నేర్చుకున్నాడు. ఆయన 'రచ్చ' సినిమాకు చాన్స్ దక్కించుకున్నప్పుడు ఆయన అదృష్టాన్ని చూసి ఎందరో కుళ్లుకున్నారు.
ఇక ఆ తర్వాత ఏకంగా పవన్‌కళ్యాణ్ తన 'సర్దార్‌గబ్బర్‌సింగ్'కు ఆయనకే అవకాశం ఇస్తే ఇక ఆయన జాతకం మారిపోయిందన్నవారు ఉన్నారు. కానీ ఆ చిత్రం నుండి హఠాత్తుగా పవన్ అతనిని తొలగించడంతో ఆయన్ను అయ్యో...పాపం అన్నవారు కూడా ఉన్నారు. అయినా తనకు అవకాశాన్ని ఇచ్చినట్లు ఇచ్చి అవమాన పరిచిన పవన్‌పై సంపత్ నందికి మాత్రం పిచ్చ ప్రేమ తగ్గడం లేదు. ఆ తర్వాత కూడా ఆయన తాను రవితేజతో తీసిన 'బెంగాల్ టైగర్'చిత్రంలో కూడా పనన్ నామస్మరణ చేశాడు. ఆయనపై కొన్ని డైలాగులు, 'ఖుషీ' చిత్రంలోని కొన్ని సీన్స్‌ను వాడుకున్నాడు. ఇక ఆయన తాజాగా గోపీచంద్ హీరోగా ఓ చిత్రం పూర్తి చేసిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం టైటిల్‌ను కూడా 'గౌతమ్ నంద' అని పెట్టాడు. ఇది 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్‌కళ్యాణ్ పాత్ర పేరు కావడం విశేషం. ఇక ఈ చిత్రం కొత్తలుక్‌లో గోపీచంద్ అల్ట్రా మోడ్రన్‌గా ఉన్నాడు. 'జిల్'చిత్రంలో స్టైలిష్‌గా కనిపించిన దానికంటే ఇందులోనే గోపీచంద్ లుక్ మరింత బాగుంది. ఈ చిత్రం గోపీకి, సంపత్‌కు అత్యంత కీలకం. మరి ఈ చిత్రంలో కావాలని హీరో పేరును గౌతమ్ నందగా పెట్టి, అదే పేరును టైటిల్‌గా పెట్టాడో? లేక కథానుసారమే ఈ టైటిల్‌ను సంపత్ ఎంపిక చేశాడో తెలియాలంటే సమ్మర్ వరకు ఎదురుచూడాల్సిందే.