రామ్‌చరణ్.. కెరీర్ మొదట్లో ఆరు ఫైట్లు, ఐదు పాటలు, ఓ స్పెషల్ ఐటం సాంగ్, కాసేపు కామెడీ వంటి ఫక్తు కమర్షియల్ చిత్రాలను చేసుకుంటూ వెళ్లాడు. మొదట్లో ఈ ఫార్ములా ఆయనకు బాగానే కలిసొచ్చింది. కానీ రాను రాను అది అడ్డం తిరిగింది. దీంతో కాస్త డిఫరెంట్‌గా చిత్రాలను చేస్తున్న బన్నీ కంటే రేస్‌లో వెనుకబడ్డాడు. ఈ సమయంలో ఆయనపై పలు విమర్శలు వచ్చాయి. విభిన్న చిత్రాలను ఎంచుకోవాలనే వాదనలు వినిపించాయి. ఆయన ఆ విమర్శల సారాన్ని అర్ధం చేసుకున్నాడు. దాంతో పాటు ఆయన కెరీర్‌పరంగా చిత్రాలను ఎంచుకుంటున్న పద్దతిపై మణిరత్నం వంటి వారు కూడా ఆయనకు ఎన్నో సలహాలిచ్చారని సమాచారం. దాంతో ఆయన తన పంథా మార్చాడు. 'ధృవ' చిత్రంతో ఓ విభిన్న ప్రయోగం చేశాడు. ఇక ప్రస్తుతం సుకుమార్ చిత్రంలో కూడా పక్కా పల్లెటూరి కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రం ఓపెనింగ్ లుక్‌లోనే ఆయన పంచెపైకి కట్టి, కావడి మోస్తూ వెనుక నుంచి వేసిన ఛాయాచిత్రం బాగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత కూడా ఆయన కొరటాల శివతో ఓ సందేశాత్మకమైన చిత్రాన్ని, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాన్ని, గౌతమ్ మీనన్ లేదా క్రిష్‌ల దర్శకత్వంలో ఓ స్పైథ్రిల్లర్‌ను చేయనున్నాడని సమాచారం. ఇక మణిరత్నం దర్శకత్వంలో కూడా ఆయన ఓ క్లాసిక్ మూవీ చేసేందుకు సింసిద్దుడవుతున్నాడు. ఇక 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌రాజా'లు తీసిన మేర్లపాక గాంధీని కూడా చరణ్ ఓ మంచి ఎంటర్‌టైనింగ్ స్టోరీనీ తయారు చేయమని ఆదేశించాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి చరణ్ కొత్త ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన నిర్ణయాలను ఇప్పుడు ప్రశంసించాల్సిందే.