ప్రస్తుతం ట్రెండ్ మార్చి వరస విజయాలతో జూనియర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. భవిష్యత్తులో కూడా ఆచితూచి అడుగులు వేయాలనుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం టాలీవుడ్‌లోని కుర్రస్టార్స్‌లో పౌరాణిక పాత్రలను పోషించే ధైర్యం, అలాంటి నటనాప్రతిభ, తెలుగు భాషపై మంచి పట్టు ఉన్న ఏకైక స్టార్‌గా జూనియర్‌ను చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన 'యమదొంగ' చిత్రంలో కాసేపు యంగ్ యమునిగా మోహన్‌బాబును సైతం ఔరా.. అనిపించాడు. ఆయన బాలనటునిగా రాముని పాత్రలో చేసి మెప్పించిన 'బాల రామాయణం' చిత్రానికి అభినవ బాపుగా పిలువబడే గుణశేఖర్ దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఈయన కూడా త్వరలో పౌరాణిక పాత్రలైన భక్త ప్రహ్లాద, హిరణ్యకస్యపుల చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తూ, ఆల్‌రెడీ ఈ చిత్రానికి 'హిరణ్యకస్యప' (ది స్టోరీ ఆఫ్ భక్తప్రహ్లాద) అనే టైటిల్‌ను కూడా రిజిష్టర్ చేయించాడు. 'రుద్రమదేవి' తర్వాత ఆయన చేస్తున్న మరో సాహసం ఈ చిత్రం. స్వర్గీయ ఎన్టీఆర్ తరహాలో ప్రతినాయకుడి ఛాయలుంటే హిరణ్యకస్యపుని కోణంలో ఈ చిత్రం కథ ఉంటుంది. ఇందులో ఎవరినైనా స్టార్‌ని ఒప్పించే ప్రయత్నాలను గుణ చేస్తున్నాడు. ఎవ్వరూ ఒప్పుకోకపోతే రానాతోనైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నాడు.
కాగా ఇటీవల మన హీరోలు కూడా ప్రతినాయక ఛాయలుండే పాత్రను చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎన్టీఆర్ తాజాగా బాబి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో త్రిపాత్రాభినయం చేయనున్నాడని, అందులో ఓ పాత్ర నెగటివ్ ఛాయలుండే పాత్ర అని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే 'టెంపర్'లో ఆయన అదరగొట్టాడు. తాజాగా గుణశేఖర్ మాట్లాడుతూ, ప్రతినాయక ఛాయలుండే పాత్రలను మన హీరోలు కూడా చేయాలనుకుంటున్నారని, వాటికి మంచి ఆదరణ కూడా లబిస్తోందని పేర్కొన్నాడు. దాంతో పాటు 'హిరణ్యకస్యపు' స్టోరీ నచ్చితే దీనిలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇక 'ప్రతాపరుద్రుడు' కి కూడా స్క్రిప్ట్ పూర్తయిందని, 'హిరణ్యకస్యప' చిత్రం తర్వాత ఆ చిత్రం తన స్వీయదర్శకనిర్మాణంలో ఉంటుందని ఆయన తెలిపడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో నటించడానికి జూనియర్ అంగీకరిస్తే మాత్రం ఆయన అభిమానులకు ఇక పండగే పండగ...!