కోలీవుడ్‌లో రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడు, స్టార్ అజిత్. ఆయన కోసం ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. కాబోయే తమిళనాడు సీఎంగా కూడా అజిత్‌ను ఎందరో భావిస్తున్నారు. ఈయన నిజజీవితంలో కూడా మచ్చలేని, నిజాయితీ కలిగిన, సేవాభావం ఉన్న అజాత శత్రువు. ఆయన నటిస్తున్న చిత్రాలు వరసగా బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలుస్తుండటం, మరోపక్క రజనీతో పాటు పలువురు స్టార్స్ ఫామ్ కోల్పోతుండగా, అజిత్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు. ఆయనకు కూడా ఓ సెంటిమెంట్ ఉంది. తన చిత్రాల టైటిల్స్‌లో మొదట 'వ'తో మొదలైన చిత్రాలన్నీ ఆయనకు ఎనలేని పేరును తీసుకొచ్చాయి. గతంలో 'వాలి, విలన్'లు దీనికి ఉదాహరణ. తాజాగా టాలీవుడ్ కు కూడా పరిచయమున్న దర్శకుడు శివ.. అజిత్‌ను వరుసగా మెప్పిస్తూ వస్తున్నాడు. అజిత్‌ది నమ్మినవారికి ప్రాణాలిచ్చే తత్వం. దాంతో ఆయన కోసం ఎందరో దర్శకులు వెయిటింగ్‌లో ఉన్నప్పటికీ ఆయన శివకు వరుస అవకాశాలు ఇస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రస్తుతం హ్యాట్రిక్ మూవీ రూపొందుతోంది. ఇటీవల 'వీరం, వేదాళం' వంటి బ్లాక్‌బస్టర్స్ వీరిద్దరి కాంబోలో వచ్చాయి. ఈ రెండు చిత్రాల టైటిల్స్ కూడా 'వ' తోనే ప్రారంభం కావడం విశేషం. దాంతో ప్రస్తుతం వీరి కాంబినేషన్ రూపొందుతున్న తాజా చిత్రానికి కూడా 'వివేగమ్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, మరోసారి 'వ' సెంటిమెంట్‌ను వాడుకున్నారు. దీనిని ఇప్పటివరకు అందరూ 'తలా57' అని పిలిచారు. ప్రస్తుతం అదే ట్రెండ్‌ను విజయ్, తెలుగులో మహేష్‌బాబులకు కూడా మన మీడియా వాడుతోంది.
ఇక 'వివేగమ్' ఫస్ట్‌లుక్‌లో అజిత్ అదిరిపోయేలా కనిపిస్తున్నాడు. రౌద్రమైన, తీక్షణమైన చూపులతో సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తూ బాలీవుడ్, హాలీవుడ్ హీరోలను మైమరిపిస్తున్నాడు. ఆయన లుక్‌ని చూసిన బాలీవుడ్ షారుఖ్, వివేక్‌ఒబేరాయ్‌తో పాటు కోలీవుడ్ క్వీన్ నయనతార కూడా అజిత్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమిళంలో ఈ చిత్రం అజిత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇది జేమ్స్‌బాండ్ తరహా చిత్రం కావడం, ఇందులో అజిత్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా పలు దేశాలోని నేరస్తులు వెతికే పని కాబట్టి అందుకు తగ్గట్లుగా ఇప్పటివరకు ఇండియా సినీ చరిత్రలోనే మొదటి సారిగా అతి ఎక్కువ దేశాలలో షూటింగ్ చేశారు. మొత్తానికి ఈ అజిత్ లుక్‌ను చూసిన వారంతా వావ్.. అంటున్నారు. వాస్తవానికి తెలుగులో పవన్‌లాగానే తమిళంలో అజిత్‌కు కూడా సిక్స్‌ప్యాక్‌తో కనిపించడం వంటివి నచ్చవు. తన సహజస్టైల్‌లోనే నెరసిన జుట్టు, గడ్డాలతో కనిపిస్తూ. వాటినే ట్రెండ్‌గా నిలుపుతూ వస్తున్న తలా ఈ చిత్రం కోసం మాత్రం సిక్స్‌ప్యాక్‌ను పెంచాడు. ఇది కథకు చాలా ముఖ్యమట. ఇక ఆయన ఎంతో కష్టపడి సాధించిన సిక్స్‌ప్యాక్ పోస్టర్స్‌ను కూడా కొందరు మార్ఫింగ్ అంటూ ప్రచారం చేస్తుండటంతో అలా ప్రచారం చేస్తున్న యాంటీ ఫ్యాన్స్‌పై తలా అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. కేవలం సోషల్ మీడియాలోనే కాదు.. ఈరోజు పలు తమిళ దినపత్రికల్లో కూడా ఈ చిత్రం లుక్‌కు, టైటిల్‌కు ప్రకటనలు ఇచ్చారు. ప్రస్తుతం అజిత్ నటించిన 'వీరం,వేదాళం' వంటి చిత్రాల రీమేక్స్ చేస్తున్న పవన్‌తో చిత్రం చేయాలనుకునే దర్శకనిర్మాతల కన్ను ఈ సినిమాపై కూడా పడటం సహజం. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం కోలీవుడ్‌లో ఘనవిజయం సాధిస్తే.. ఇదే చిత్రాన్ని అదే దర్శకుడు శివ.. పవన్‌తో చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం. కాబట్టి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా! అని కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ కూడా ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంచలన నటి అక్షరహాసన్ కీలకపాత్రలో నటిస్తోంది.