చిరంజీవి బ్రాండ్ నుండి బయటకు వచ్చేందుకు మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ ప్రయత్నిస్తున్నాడా? తన కంటూ సొంత ఇమేజ్ ఏర్పరచుకునే యత్నంలో ఉన్నాడా? అంటే సినీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. సొంతంగా ఎదగితే కెరీర్ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. కేవలం చిరంజీవి మేనల్లుడు అనే బ్రాండ్ తోనే సినిమాలు చేస్తూ వెళుతుంటే భద్రత తక్కువ. పరిచయానికి, అవకాశాలు రావడానికి చిరు ఇమేజ్ ఉపయోగపడింది. కానీ ఆ తర్వాత కూడా అదే బ్రాండ్ తో కొనసాగితే మాత్రం ఇబ్బంది తప్పదు. పైగా చిరు వల్లే సినిమాలు వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. గతంలో నాగబాబు నటుడిగా మారిన సందర్భంలో ఇలాంటి డైలమా ఎదురైంది. నాగబాబుకు హీరో అవకాశాలు వచ్చాయి. తెరపై చిరు తమ్ముడనే చూశారని అంటారు. దీనివల్ల నాగబాబు కెరీర్ ముందుకుసాగలేదు. హీరో పాత్రలు రాకపోవడంతో చివరికి క్యారెక్టర్ నటుడిగా మారకతప్పలేదు. చిరంజీవి వారసుడు రామ్ చరణ్ పరిస్థితి కూడా అంతే ఉంది. సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలున్నాయి. ఇంకా తండ్రి చాటు బిడ్డలాగే ఉన్నాడు. అందువల్ల అల్లు అర్జున్ లాగా తనకంటూ స్టార్ డమ్ తెచ్చుకోలేదని అంటారు.
ఈ అనుభవం సాయిధరమ్ తేజ్ గ్రహించినట్టున్నాడు. ఒకవైపు చిరంజీవిని ఆరాధిస్తూనే, తన కంటూ సర్కిల్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇటీవల సాయిధరమ్ కొత్త సినిమా మొదలైంది. దీనికి జూ.ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. తాజా చిత్రం 'విన్నర్' తొలి పాటని మహేష్ బాబు ఆవిష్కరించారు. ఇతర స్టార్స్ తో స్నేహబంధం తన భవిష్యత్తుకు మంచి బాట వేస్తుందని సాయిధరమ్, ఆయన సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. మెగా హీరోలందరికీ ఆదర్శం చిరంజీవి. ఆయనను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన వారే. ఆయన ప్రేరణతోనే హీరో లయ్యారు. ఇది ఇండస్ట్రీ ఎంట్రీకి పనికివచ్చింది. ఇప్పుడు ఆ బ్రాండ్ నుండి బయటకు వచ్చి సోలో 'విన్నర్' కావాలనే ఆలోచన మంచిదే..