జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ కుల మతాలకు అతీతంగా సమస్యలను ప్రశ్నిస్తుండటం ప్రశంసనీయం. మోదీ, వెంకయ్య, చంద్రబాబు వంటి అధికార పార్టీ వారిని కూడా ఆయన చీల్చిచెండాడుతున్నాడు. అధికారంలో ఉన్న వారు అనుకుంటే పవన్‌కి ఎన్నో ఇబ్బందులను, ఆయన కెరీర్‌కే గాక, ఆర్థికంగా ఆయన ఎదుగుదలను కూడా నియంత్రించగలరు. అదే ఆయన రాజీ పడితే ఏదైనా పదవినైనా ఇవ్వగలరు. కానీ పవన్ ఏమాత్రం భయపడకుండా వారిని టార్గెట్ చేస్తుండటం విశేషం. అయితే ప్రస్తుతం పవన్ ఘాటుగా చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. రానున్న కాలంలో ఈ ఉదృతి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే పవన్ తనపై వస్తున్న విమర్శలకు అందరిలాగా ప్రతివిమర్శలు చేయకుండా, రెచ్చగొడితే.. రెచ్చిపోతాం.. అనే తరహాలో ప్రవర్తించకూడదు.
ఇది ప్రమాదకర ధోరణి. ఇక్కడ ఆయనకు ఎదురవుతున్న విమర్శ గురించి చర్చించుకోవాలి. ఆయన రిపబ్లిక్‌డే సందర్భంగా వైజాగ్ ఆర్కేబీచ్‌లో యువత చేపట్టిన ప్రత్యేకహోదా ఉద్యమానికి మొదటగా స్పందించి, తన మద్దతును తెలిపాడు. కానీ ఆయన స్వయంగా ఎందుకు పాల్గొనలేదో చెప్పలేకపోతున్నాడు. జగన్ వచ్చి తూతూ మంత్రంగా నిరసన తెలిపి క్రెడిట్ కొట్టేశాడు. మరి పవన్ కూడా కేవలం ఓ నాలుగైదు గంటలు సమయం కేటాయించి, వైజాగ్‌కు వచ్చి, పోలీసులు అడ్డుకుంటే విమానాశ్రయంలోనే కూర్చొని నిరసన తెలిపివుంటే బాగుండేది. కానీ ఆయన తానలాంటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ జనాల మధ్యకు వస్తే, ఉద్యమకారులు రెచ్చిపోతారని, తనను చూడటానికే ఎక్కువ మంది వచ్చి ఉద్యమం పక్కదారి పడుతుందని భావించాడట.
కానీ ఇందులో నిజం లేదు. ఆయన చెప్పినట్లు నడుచుకోవడానికి ఉద్యమకారులు అంగీకరించేవారే. పవన్‌కు స్ఫూర్తినిచ్చిన జల్లికట్టు ఉద్యమంలో రజనీ నుంచి లారెన్స్ వరకు అందరూ ప్రత్యక్షంగా పాల్గొన్నా కూడా ఆందోళనకారులను కట్టడి చేయగలిగారు. తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా స్టార్ విజయ్ సైతం ఆ ఆందోళనకు హాజరై ప్రశంసలు అందుకున్నాడు. మరి పవన్ అలా ఎందుకు చేయలేకపోయాడు? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరోపక్క అదికార టిడిపి, బిజెపి, పోలీస్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ ఉద్యమం విషయంలో తెలివిగా వ్యవహరించారు. ఈ ఉద్యమానికి ఎవ్వరూ ముందుకు వచ్చి తమ నాయకత్వంలో చేస్తున్నామని, అందుకు పోలీసుల నుండి అనుమతి తీసుకోలేదని, మరి ఎలాంటి నాయకుడు ముందుకురానప్పుడు ఈ ఆందోళనలో ఉద్యమకారులతో పాటు సంఘవిద్రోహ శక్తులు పాల్గొని విద్వంసం సృష్టిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. మరి ఏపీ యువత తరపున లేక జనసేన, కాంగ్రెస్, వైసీపీ, వామపక్షాల వంటి పార్టీలతో పాటు ఇతర మేథావులైన చలసాని శ్రీనివాస్, లోక్‌సత్తా జెపి వంటి వారు తామెందుకు తమ నాయకత్వంలో ఈ ఆందోళన జరగుతుందని పోలీసులకు హామీ ఇవ్వలేకపోయారు? అన్న విమర్శకు అందరూ బాధ్యులేనని చెప్పాలి...! దీనిపై పవన్ కూడా స్పందించాల్సివుంది...!