సినిమా వారికి సెంటిమెంట్స్ ఎక్కువ. దీనికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఓ చిత్రం ఫ్లాప్ అయితే ఆ చిత్ర హీరోల వ్యతిరేక అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రావడం సహజం, దీంతో వారి విమర్శలకు తలవంచి, అనవసరంగా విమర్శలకు తావివ్వకూడదనే ఆలోచనలో పలువురు స్టార్స్ ఉన్నారనే వాదన వినిపిస్తోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఏదైనా చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చినా, లేదా ఆయన చేతుల మీదుగా ఆడియో వంటి వేడుకలు జరిగినా ఆయా చిత్రాలు ఫ్లాప్ అవుతాయనే సెంటిమెంట్స్‌ను యాంటీ ఫ్యాన్స్ సంధించేవారు. కానీ తర్వాత తర్వాత ఆయన హాజరైన పలు చిత్రాలు మంచి హిట్ కావడంతో ఇప్పుడు పెద్దగా ఆ విమర్శలు రావడం లేదు.
ఇక యంగ్‌టైగర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇప్పుడు ఓ సెంటిమెంట్ పేరుతో విమర్శలు వస్తున్నాయని, అందుకే ఆ విషయాలలో యంగ్‌టైగర్ కూడా కాస్త ఆలోచిస్తున్నాడనేది టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. తాజాగా రానా హీరోగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానున్న సబ్‌మెరైన్ యుద్ద నేపధ్యంలో తెరకెక్కించిన చిత్రం 'ఘాజీ'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అద్భుతమనే టాక్‌ను తెచ్చుకుని, పలువురి ప్రశంసలను అందుకోవడమే కాదు.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు సోలోహీరోగా పెద్దగా సక్సెస్‌లేని రానా సంకల్ప్ అనే నూతన దర్శకునిపై నమ్మకంతో ఈ చిత్రం చేశాడు. దీనిపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి17న విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ చూసి, దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు హిందీలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ అంగీకరించాడు. ఈ చిత్రం కథ ఎవ్వరికీ తెలియని ఓ సబ్‌మెరైన్ సబ్జెక్ట్ కావడంతో ఈ చిత్రకథను, అందులోని సారాంశాన్ని, పాత్రలను పరిచయం చేసి, కేవలం వాయిస్ ఓవర్‌తోనే ప్రేక్షకులకు ఈ చిత్రం కథపై అవగాహన కల్పించడం, ఆడియన్స్ సినిమాలో లీనమయ్యేలా చేయడం చాలా ముఖ్యమని ఈ చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
దీంతో ఈ వాయిస్ ఓవర్‌కు ఎక్కడ లేని ప్రాధాన్యత ఏర్పడింది. హిందీలో ఈ బాద్యతను బిగ్‌బి తీసుకోగా, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, తమిళంలో హీరో సూర్యలు ఈ బాధ్యతలకు అంగీకరించారు. ఇది అభినందించదగ్గ విషయం. వాస్తవానికి ఈ చిత్రానికి తెలుగులో వాయిస్ ఓవర్‌ను మొదట రానా బాబాయ్ వెంకటేష్‌కి ఇవ్వాలని భావించి తర్వాత వద్దనుకున్నారు. ఇక ఎన్టీఆర్‌ను సంప్రదించగా, ఆయన ఒప్పుకున్నప్పటికీ ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చిన పలు చిత్రాలు పరాజయం పాలవ్వడం అనే సెంటిమెంట్ ఎన్టీఆర్‌నే కాదు.. ఈ చిత్ర దర్శకనిర్మాతలను కూడా వేధించిందని, అందుకే ఎన్టీఆర్ ఆ బాధ్యత నుంచి స్వచ్చందంగా తప్పుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో నిజానిజాలేంటో వారికే తెలియాలి.