నేడు ప్రతి భాషలోనూ ఆయా భాషా చిత్రాలకు ధీటుగా డబ్బింగ్ చిత్రాలు, ఇతర భాషల చిత్రాలు కూడా పోటాపోటీగా విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఏ చిత్రాలు బాగుంటే ఆ చిత్రాలనే ఆదరిస్తూ.. తమ అభిరుచిని చాటుకుంటున్నారు. కాగా ఫిబ్రవరి3వ తేదీన దిల్‌రాజు-నానిల కాంబినేషన్‌లో విడుదలకు సిద్దమవుతున్న 'నేను..లోకల్' చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. నాని, కీర్తిసురేష్ వంటి వారికి ఉన్న క్రేజ్‌తో పాటు నిర్మాతగా దిల్‌రాజు టేస్ట్‌పై, జడ్జిమెంట్‌పై ఉన్న నమ్మకం కూడా ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అవుతోంది. అదేరోజున మోహన్‌లాల్ నటించిన 'కనుపాప' అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదలవుతోంది. పేరుకు డబ్బింగ్ చిత్రమే అయినా ప్రస్తుతం మోహన్‌లాల్‌కు తెలుగులో ఉన్న క్రేజ్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.
ఇక ఈ చిత్రం మలయాళంలో 'ఒప్పం' పేరుతో సంచలన విజయం సాధించింది. పూర్తి వైవిధ్యమైన క్రైమ్ థ్రిల్లర్ కావడం, హీరోగా మోహన్‌లాల్ అంధుని పాత్రలో అద్బుతంగా నటించిన ఈ చిత్రంపై కూడా కొంతమందికి మంచి ఇంట్రస్ట్ ఉంది. ఇక ఈ చిత్రాన్ని గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన 'పసివాడి ప్రాణం' చిత్రంతో నిర్మాతలు పోలుస్తున్నారు. ఓ అంధుడే హీరో అయి, ఓ చిన్నారిని కాపాడటం కోసం పడే తపన ఎలా ఉంటుందనే విషయాన్ని ఎంతో అద్భుతంగా ఈ చిత్రంలో తెరకెక్కించామంటున్నారు. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక ఫిబ్రవరి 9వ తేదీన సూర్య-హరిల కాంబినేషన్‌లో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం 'ఎస్3' పలు వాయిదాల అనంతరం విడుదలకు సిద్దమవుతోంది. 'సింగం' సిరీస్ కావడం, పవర్‌ఫుల్ యాక్షన్ పోలీస్ స్టోరీగా రూపొందడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ, సూర్య కెరీర్‌లోనే కాదు.. రజనీ తర్వాత ఆ స్థాయిలో తమ చిత్రానికి విడుదలకు ముందే 100కోట్ల బిజినెస్ జరిగిందని ఈ చిత్ర నిర్మాతలు పబ్లిసిటీ చేస్తున్నారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుండగా, ఆ పక్కరోజే కింగ్ నాగార్జున నటించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం కూడా విడుదలకు సిద్దమవుతుండటంతో వచ్చే వారం కూడా టాలీవుడ్‌లో రసవత్తర పోటీకి రంగం సిద్దమైంది. మరి ఈ లోకల్ వర్సెస్ నాన్‌లోకల్ పోరులో ఎవరు విజేతలుగా నిలుస్తారో వేచిచూడాల్సివుంది. కాగా కొందరు మాత్రం కర్ణాటకలలోగానే తెలుగులో కూడా బయటి భాషాచిత్రాల డబ్బింగ్‌లను ఆపాలనే తరహా వ్యాఖ్యలను మరలా తెరపైకి తెస్తున్నారు.