పార్లమెంటులో నేటి నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ సమావేశాల్లో ఏ రకమైన ఎత్తుగడలు వేయాలన్న దానిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఆలోచిస్తూ... సంసిద్ధమౌతున్నారనే చెప్పాలి. ఈ సమావేశాల్లో అరుణ్ జైట్లీ, మోడీలు ఎటువంటి బడ్జెట్ ను తీసుకుని వస్తారో అనే విషయంపై దేశంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఊపందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అధికార తెదేపాని ఇరుకున పెట్టేందుకు, ఆ రకంగా పవన్ ను కూడా రాజకీయంగా నిలువరించేందుకు వైకాపా అధినేత జగన్ తీవ్రంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆ రకంగా ఆంధ్రా ప్రజల్లో తాము తీవ్రంగా పోరాటం చేస్తున్నామన్న క్రెడిట్ ను పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయకుంటే పార్లమెంటు సమావేశాలకు తప్పక ఆటంకం కలిగిస్తామని వైకాపా వెల్లడిస్తుంది. ఈ దిశగా జగన్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రాంతీయంగా తాను ఎన్ని పోరాటాలు చేసినా తగిన గుర్తింపు రావడం లేదు సరికదా ప్రజల్లో అందుకు తగిన క్రెడిట్ కూడా దక్కడం లేదని జగన్ కంగారు పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అదే విధంగా స్థానికంగా తమ పార్టీ అన్ని రకాలుగా ఉద్యమాలు చేస్తుంటే ఏసీలో కూర్చొని ట్వీట్లు పెడుతున్న పవన్ కే ఆంధ్రా ప్రజల్లో క్రెడిట్ పొందుతున్నాడని జగన్ తెగ బాధ పడుతున్నట్లు తెలుస్తుంది.
వైజాగ్ ఆర్కే బీచ్ లో యువత చేపట్టిన శాంతియుత నిరసనే అందుకు ప్రత్యక్ష సాక్షంగా తెలుస్తుంది. అంత కష్టపడి తాను వైజాగా వెళ్ళి ప్రతిఘటనకు గురై, పోలీసులతో పోరాడి మరీ అసహనంతో వెనుతిరిగి వస్తే, పవన్ మాత్రం ఏమీ చేయకుండా ఒట్టిగా ట్వీట్ల వర్షాన్ని కురిపించి ఓ ప్రెస్ మీట్ పెట్టి అంతా మాట్లాడి ప్రజల్లో తానే క్రెడిట్ అంతా కొట్టేసినట్లుగా జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఇక కేంద్రంపై ప్రత్యక్ష ఒత్తిడి తెచ్చి ఆ దిశగా తమ పోరాట పటిమను, వీలైతే రాజీనామాల ద్వారా ప్రజల్లో తమ తెగువను ప్రదర్శించాలని చూపుతున్నాడు జగన్. ఈ రకంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటులో తన ఎంపీలు తీవ్ర నిరసనని తెలపాలని కూడా జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది. అందుకు కేంద్రప్రభుత్వం పట్టించుకోని పక్షంలో తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని కూడా జగన్ ఎత్తు వేస్తున్నట్లు వైకాపా వర్గాల ద్వారా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో అటు తెదేపాకు, జనసేనకు చెక్ పెట్ట వచ్చని కూడా జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.