Advertisement
Google Ads BL

చంద్రబాబూ..ఏపీ కి నీవే దిక్కనుకోవద్దు..!


ప్రస్తుతం రాష్ట్రం రెండుగా విడిపోయి.. ఏపీకి అన్యాయం జరిగిందనేది వాస్తవం. దాంతో ఏపీ రెవిన్యూ లోటుతో నానా భాధలు పడుతోంది. కానీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనకున్న మంచి ఇమేజ్‌తో.. కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నాడు అనేది కూడా వాస్తవమే. ఇక కేంద్రం సహాయం, సహకారం.. మద్దతు లేనిదే ఏపీ అభివృద్ది సాధించలేదని, కాబట్టి చంద్రబాబు.. మోదీకి మద్దతునిస్తున్నారనేది కూడా నగ్నసత్యమే. ప్రత్యేకహోదా లేకపోయినా ఏపీలోకి పెట్టుబడులు పెట్టడానికి ఎందరో సుముఖత చూపుతుండటానికి చంద్రబాబు దూరదృష్టి కూడా కారణమే. కానీ ఇక్కడ చంద్రబాబు గుర్తించాల్సిన మరో విషయం ఉంది. ప్రత్యేకహోదా లేకుండానే రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెలుతున్న చంద్రబాబుకు, ప్రత్యేకహోదా కూడా ఉండివుంటే.. ఇంక ఏపీకి తిరుగేలేదనే స్థాయిలో విజృంభించేవాడు. అదే నేడు ఏపీ ప్రజల ఆవేదన. ఇక చంద్రబాబు దేశంలోనే మంచి అడ్మినిస్ట్రేటర్‌. ఈ విషయం ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడో నిరూపించుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ మరణానంతరం ఏర్పడిన భారీ సానుభూతి పవనాలను కూడా కాదని, తెలుగు ప్రజలు ఆయన పాలన చూసి ఆనాడు గర్వంగా ఫీలయ్యారు. సమైక్యాంధ్ర ప్రజలందరూ ఎన్టీఆర్‌ స్థాపించిన టిడిపిని బాబు వెన్నుపోటు పొడిచి మరీ హైజాక్‌ చేశాడని, టిడిపిని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నాడని.. దొడ్డిదారిన సీఎం అయ్యాడని, ఎన్టీఆర్‌లాంటి వాడి మీద చెప్పులు వేయించి, అవమానపరిచాడని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేసి, ఎన్టీఆర్‌ మరణానంతరం ఇక టిడిపికి అడ్రస్‌ ఉండదని, తమదే రాష్ట్రంలో ఏకచ్చత్రాధిపత్యమని భావించినా, తన పాలనతో ప్రజలను మెప్పించి, రెండోసారి కూడా సీఎం అయ్యాడు బాబు. 

Advertisement
CJ Advs

విద్యుత్‌ ఉద్యమకారులపై కాల్పుల వంటి ఘటనలు ఆయనకు మచ్చతెచ్చాయి. మొదటి రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా బ్యూరోక్రాట్లు, వేలాది రూపాయల జీతాలు తీసుకుంటూ, పనిచేయని ప్రభుత్వ ఉద్యోగులపై ఆయన తీసుకున్న కఠిన చర్యలను ప్రజలు మెచ్చుకున్నారు. దీనివల్ల ఆయన ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి గురైనా వెనకడుగువేయలేదు. దాంతో ఆయన్ను ఎందరో స్ఫూర్తిగా తీసుకున్నారు. స్వయాన తమిళ గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ తాను అర్జున్‌ హీరోగా తీసిన 'ఒకే ఒక్కడు' చిత్రానికి చంద్రబాబే స్ఫూర్తి అని ప్రకటించాడు. ఇక ఆయన కేంద్రంలో కూడా చక్రం తిప్పాడు. తృతీయఫ్రంట్‌ను అధికారంలోకి తీసుకుని రావడంలో కీలకపాత్ర పోషించాడు. దేవగౌడ వంటి వారిని ప్రధానిని చేసినా తాను మాత్రం ఆ పదవి శాశ్వతం కాదని, తాను రాష్ట్రానికి సీఎంగా ఉంటేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, దేవగౌడలాగా రెంటికి చెడ్డ రేవడి కావడం ఇష్టంలేక ప్రధాని పదవిని వద్దనుకున్నాడు. ఇక వాజ్‌పేయ్‌ హయాంలో బిజెపికి పూర్తిగా మెజార్టీరాకపోవడంతో ఎన్డీయే లో కీలకపాత్ర పోషించి, తన కీలకమైన పాత్రతో కేంద్రం నుంచి ఏపీకి ఎంతో సాయం అందేలా చేశాడు. ఇప్పడు కూడా మోదీకి కేంద్రంలో పూర్తి మెజార్టీ రాకపోయి ఉంటే కేంద్రం మెడలను బాబు వంచేవాడు. కానీ ఆయనకా అవకాశం లేదు. బిజెపికి కేంద్రంలో స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఆయనేమీ చేయలేకపోతున్నాడు. మరోపక్క వైఎస్‌ మృతి తర్వాత, రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో, జగన్‌, కాంగ్రెస్‌ వంటి వారు అధికారంలోకి రావడం ఇష్టంలేని ప్రజలు చంద్రబాబును ఉన్నవారిలో బెటర్‌గా భావించి, పట్టం కట్టారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో కలపకుండా ఉంటే ఆయన గురించి కాస్త ఆలోచించేవారు. కానీ ఆయన పదవి కోసం తన సొంత పార్టీని అందరికి ఆగ్రహం కలిగించే విధంగా సోనియా కాళ్ల దగ్గరం పెట్టడం, సోనియా రాష్రాన్ని అన్యాయంగా విభజించడంలో చిరు కూడా కాంగ్రెస్‌కు పరోక్షగా దోహదం చేశాడనే వ్యతిరేకత వచ్చింది. జగన్‌ వస్తే పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంటుందని ప్రజలు భావించారు. దాంతోనే వారు చంద్రబాబు వెనుక నిలబడ్డారు. కానీ నేడు బాబు కూడా వైఎస్‌ లాగా 'తిను.. తినిపించు' అనే పద్దతి అవలంబిస్తూ, కులరాజకీయలను, లోకేష్‌ను పదవి ఎక్కించాలని పడుతున్న తాపత్రయం, తెలుగు తమ్ముళ్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్న విధానం.. దానిని చంద్రబాబు చూసి చూడనట్లు ఉండడాన్ని, స్వయంగా తానే ఓటుకు నోటు చేయడాన్ని, వలసలను ప్రోత్సహించడాన్ని, పార్టీ ఫిరాయించిన వారికి ఒంత పాడుతూ, నిజాయితీ కలిగిన నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా పరగణిస్తున్నారనేది వాస్తవం. దీన్ని బాబు గ్రహించాలి. 

ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రాని కంటే ఆయన పార్టీకి , అందులోని బడా పారిశ్రామికవేత్తలకు, పార్టీలోని కాంట్రాక్టర్లకు మాత్రమే ఎక్కువ ప్రయోజనం కలుగుతోందనేది వాస్తవం. ముఖ్యంగా ప్రత్యేక ప్యాకేజీతో పాటు సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి కేంద్రం టిడిపి పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చిందనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం. మరోపక్క ఒకప్పుడు ఆయన తన పాలనలో ఐటీ రంగాన్ని బాగా మోసి, రైతులను చిన్నచూపు చూశారు. వ్యవసాయం చేయడం దండగ అని ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నాడనే విషయాన్ని పక్కనపెడితే ఆయన వ్యవసాయాన్ని, రైతులను చిన్నచూపు చూశాడు. దానికి తగ్గ ఫలితం అనుభవించాడు. ఇప్పుడు కూడా రాజధాని పేరుతో, ప్రాజెక్ట్‌ల పేరుతో చిన్న, సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతూ, బడా భూస్వాములకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇక రైతు రుణమాపీ, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ వంటి చెత్త నిర్ణయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి, తనకున్న ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసుకుంటున్నాడు. రైతు రుణమాఫీ, డ్వాకా మహిళల రుణమాఫీ, బిసీలలో కాపులను, బ్రాహ్మణులను చేర్చడం.. వంటి ప్రజాకర్షక పథకాలు, వృద్ధుల, వికలాంగుల, వితంతువులకు ఇచ్చే పింఛన్లును భారీగా పెంచేశాడు. కానీ ఈ ఫలాలన్నీ పచ్చచొక్కా సానుభూతిపరులకు, ఆ పార్టీ నాయకుల ఇష్టానుసారంగా సాగుతూ, అసలైన అర్హులకు అండడం లేదు. అసలు రైతులు కోరుకునేది నాణ్యమైన, నిరంతర విద్యుతే కానీ, ఉచిత విద్యుత్‌ను కాదు. నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందించడంలో ఆయన విజయం సాదించాడు. అలాగే నిజమైన రైతులు రుణమాఫీ కోరుకోవడం లేదు. కేవలం తమ పంటలకు రక్షణ, గిట్టుబాటు ధర, సాగునీరు, కనీస మద్దతు ధరలను పెంచడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం వంటివి మాత్రమే కోరుకుంటున్నారు. అయినా ఆ విషయం చంద్రబాబుకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు. ఆర్థికభారానికి గురయ్యే రుణమాఫీ, ఫించన్ల సొమ్ము పెంపు.. వంటి వాటిని కాకుండా ప్రత్యామ్నయాలుగా మంచి పథకాలను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. కానీ చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. వైఎస్‌ హయాంలో ఆయన ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్‌ ఆసుపత్రులకు దోచిపెట్టాడు. అవినీతికి పాల్పడ్డాడు.. అనే విషయాలను పక్కనపెడితే ఆరోగ్యశ్రీ వల్ల ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఒక 108 సేవలు ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. కానీ వాటిని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడు. ఇక ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్‌ ఆసుపత్రులకు నిధులను దోచిపెట్టడం కన్నా ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సౌకర్యాలు మెరుగుచేయడం మంచి పని, దానిని చంద్రబాబు చేస్తాడని చాలా మంది భావించారు. కానీ ఆయన ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్యం అని చెబుతున్నాడే కానీ ఆ ఆనవాళ్లు ఏ ప్రభుత్వాసుపత్రిలో కూడా కనిపించడం లేదనేది వాస్తం. 

ఇక జిల్లా స్థాయిలోని టిడిపి నాయకులైతే జన్మభూమి కమిటిల పేరుతో రెచ్చిపోతున్నారు మరోపక్క తమ కార్యకర్తలకే కాంట్రాక్ట్‌లన్నీ దక్కేలా చూసి, కార్యకర్తలకు న్యాయం చేస్తామని బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నారు. కుల రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా టిడిపిలో తారాస్థాయికి చేరాయి. వ్యక్తిగత భజనలు, చంద్రబాబు భజనలు, లోకేష్‌ కీర్తనలు కవులు రాయాల్సివస్తోంది. వారి నాయకుల భజన అలా ఉంది. తాను తప్ప ఏపీకి మరో దిక్కులేదనే ధోరణి, అహంభావం, నియంతధోరణి పెరిగిపోతున్నాయి. కనీసం ప్రతిపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమకారుల విమర్శలను వినలేని, చిన్నపాటి విమర్శలను కూడా తట్టుకోలేని తత్వం పెరిగిపోతోంది. ఓ సామాన్య, మధ్యతరగతి రైతు ఆలోచనా విధానం ఎలా ఉంటుందో బాబు ఆలోచించడం లేదు. ఓ చిన్నరైతు కేవలం తనకున్న ఒకటి రెండు ఎకరాలతో ప్రతిఏడు పంటలు పండిస్తూ జీవితం గడుపుతుంటాడు. ఆయన తర్వాత ఆయన వారసులకు కూడా అదే జీవనాధారం. తరతరాలకు వారికి అదే జీవనం. అలాంటి వారికి మీకు ఎకారాకు కోటి, రెండు కోట్లు ఇస్తామన్నా కూడా రైతు ఒప్పుకోడు. డబ్బు ఈ రోజు ఉంటే రేపు ఖర్చయిపోతుంది. దానికోసం తనకున్న ఒకే ఒక్క జీవనాధారమైన భూమిని వదులుకోలేడు. కానీ చంద్రబాబు మీకు అంతిస్తాం..లక్షలు ఇస్తామని రైతులను భయభ్రాంతులకు గురి చేసి భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. కొందరు రైతులు స్చఛ్చందంగా భూములను ఇవ్వవచ్చు. అది కూడా నిజమే. కానీ రాజధాని కోసం అందరూ త్యాగం చేయాలని, లేకపోతే రాజధాని ధ్రోహులంటున్నాడు. మరి వారి పార్టీ వారు ఏమి త్యాగాలు చేశారో చెప్పాలి. దౌర్జన్యంగా ఆర్డినెన్స్ ల పేరిట భయపెట్టి తీసుకోంటున్నాడు. వాటిని బడా వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, రియల్‌ఎస్టేన్‌ బిజినెస్‌ చేస్తున్నాడు.నేడు చాలా మంది ప్రజలు వైఎస్‌ అంతదోచుకున్నాడు... జగన్‌ ఇంత తిన్నాడు..వారి హయాంలో రెడ్లు మాత్రమే బాగుపడ్డారనే విమర్శలను ఒప్పుకోవడం లేదు. వారు బాహాటంగా వైఎసే మేలు. రూపాయి తిన్నా తమకు పావలా అయిన పెట్టాడు. ఏ నాయకుడు అక్రమంగా సంపాదించడం లేదు? ఏం..చంద్రబాబు, లోకేష్‌లు తినడంలేదా? దేశంలో ఏ రాజకీయనాయకుడు సంపాదించడం లేదు? అనేంత నిర్వేదంగా మాట్లాడుతున్నారు. ఏం... వైఎస్‌ హయాంలో కేవలం రెడ్లే బాగుపడ్డారంటున్నారు. మరి చంద్రబాబును అడ్డం పెట్టుకుని కమ్మవారు దోచుకోవడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తర్వాత లోకేష్‌ రాడా? మరి వైఎస్‌ తర్వాత జగన్‌ వస్తే తప్పేంటి అంటున్నారు. ఇక ప్రజలకు ప్రాధమిక హక్కు లయిన విద్య, వైద్యరంగాలను మంత్రి నారాయణ, కామినేని శ్రీనివాస్‌ వంటి వారికి దోచిపెడుతూ.. బాబు నీతులు చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని సరిదిద్దుకోలేకపోతే బాబే స్వయంగా జగన్‌ వంటి వాడికి అవకాశం ఇచ్చిన వాడు అవుతాడు. జర జాగ్రత్త...!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs