రామ్ చరణ్ - సుకుమార్ చిత్రం ఈ రోజు జనవరి 30న పూజా కార్యక్రమాలు జరుపుకుని అతి త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతుంది. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగా స్టార్ చిరు ముఖ్య అతిథిగా విచ్చేసి కొడుకు చరణ్ చిత్రం విజయం సాధించాలని సుకుమార్ అండ్ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపాడు. ఇంకా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొరటాల శివ కూడా వచ్చాడు. అయితే రామ్ చరణ్ ఈ చిత్రంలో ఒక డిఫ్రెంట్ లుక్ లో కనబడతాడని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఇక చరణ్ పల్లెటూరి ప్రేమ కథకు ఎలాంటి లుక్ ఉంటె బావుంటుందో అలాంటి లుక్ కోసం బాగా మేకోవర్ అయ్యాడు. ఇక సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకునే ముందే సుకుమార్ తన చిత్ర ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసాడు.
ఈ పోస్టర్ లో రామ్ చరణ్ లుంగీ కట్టి కావిడి భుజం మీద వేసుకుని అలా నడిచి వెళుతూ వెనకనుండి పక్కా పల్లెటూరి అబ్బాయిలా కనిపిస్తున్నాడు. మరి ఈ లుక్ కోసమే చరణ్ అలా తన గెడ్డం పెంచాడా... అని అప్పుడే మెగా అభిమానులు చర్చించేసుకుంటున్నారు. అసలు సినిమా ఓపెనింగ్ అయిన సంగతి కంటే ఇప్పుడు చరణ్ లుక్ మీదే ఫోకస్ పెట్టారు అందరూ. మరి ఎప్పుడూ హీరోలను స్టైలిష్ గా చూపెట్టే సుకుమార్ ఈ చిత్రంలో చరణ్ ని ఎలా చూపెడతాడో అని అందరూ తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.