ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రా మేధావులు అంతా దీక్ష చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా దీక్షలు చేపట్టేందుకు సంసిద్ధమౌతున్నట్లుగా ఆంధ్రా మేధావుల ఫోరం నాయకుడు చలసాని శ్రీనివాస్ తెలిపాడు. ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో విశాఖ బీచ్ లో ఇందుకోసం దీక్షలు చేపట్టనున్నట్లు చలసాని వివరించాడు. తాము రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం నిరంతరాయంగా పోరాటాలు చేస్తూనే ఉన్నామని చలసాని శ్రీనివాస్ వెల్లడించాడు. జనవరి 26వ తేదీనాడు ప్రత్యేక హోదా కోసం యువత శాంతియుత నిరసన తెలపడానికి పూనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వారిని నిర్బంధించేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ఆయన విమర్శించాడు. అందులో భాగంగా తాము ప్రజాస్వామ్య బద్ధంగానే మరోమారు గళం విప్పేందుకు మూడు రోజుల పాటు దీక్ష చేయనున్నట్లు చలసాని తెలిపాడు.
ఇలా ఒక పక్క పవన్ కళ్యాణ్ హోదా కోసం ఇంకా తమ పోరాటానికి సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేయాల్సి ఉంది. అదే విధంగా ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా మొన్నటి విశాఖ నిరసనల వెల్లువలో ప్రభుత్వం చూపిన కట్టడి నుండి తేరుకొని వారి వారి కార్యాచరణకు పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విమర్శకులు వెల్లడిస్తున్నారు. ఇలా హోదా కోసం దీక్షలు, నిరసనలు చేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం గొంతు నొక్కాయాలని ప్రయత్నించడం సరికాదని కిల్లి కృపారాణి వంటి మహిళా నేతలు మండిపడుతున్నారు. పోలీస్ స్టేషన్ లను అధికార పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మార్చేశారని ఆమె ఆరోపించింది. ఇంకా పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తూ ఉన్న సమయంలో అధికార పార్టీకి చెందిన సుజనా చౌదరి వంటి నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడటం పద్ధతి కాదని పలువురు విమర్శకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇంకా లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ... ఆరు నెళ్ళ క్రితం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదులుకొని కేంద్ర మంత్రులు సైతం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించామని చెప్పుకొని, ఇప్పుడు అదే హోదా కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న యువతను దేశద్రోహులుగా పరిగణించడం ఎలా అవుతుందని ఆయన తెలిపాడు. మొన్నటి వరకు హోదా కోసం నాయకులు ఉద్యమిస్తే అదే హోదా కోసం ప్రస్తుతం యువత ఉద్యమించడంలోనూ, నిరసనలు తెలపడం వల్ల తప్పేముందని జేపీ వెల్లడించాడు. ప్రస్తుతం ప్రత్యేక హోదా మాట ఎత్తితేనే తప్పన్నట్లుగా అసహనానికి గురౌతున్న ఆంధ్రా అధికార పార్టీ నాయకుల వైఖరిని ఆయన దుయ్యబట్టాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. వైజాగ్ ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు నిజంగా అప్రజాస్వామికమైనదిగా జేపీ వెల్లడించాడు. ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలుపుకొనే హక్కు ఉందని జేపీ తెలిపాడు. మొత్తానికి జేపీ కూడా ఓ మేధావిగా వైజాగ్ దీక్షలో పాల్గొంటాడో లేదో చూడాలి. ఇంకా పవన్, జగన్ వంటి నేతలు దీక్షకు ఎలా స్పందించి వారి వారి పోరాటాలతో ఎలా ముందుకు వెళ్తారనేది వేచి చూడాలి.