మెగాస్టార్ చిరంజీవి తమ్ముళ్లైన పవన్, నాగబాబులు ప్రస్తుతం వాస్తవాలు గ్రహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే చిరంజీవితో రాజకీయంగా విభేదించి, 'జనసేన' పార్టీని స్థాపించి, తన గళం వినిపిస్తున్నాడు. ఈ సమయంలో ఆయన తనకు కులం బురద అంటకూడదనే ముందుచూపుతో సాగుతున్నాడు. కాబట్టే ఇప్పటివరకు ఆయన ముద్రగడ పద్మనాభానికి తన అన్నయ్య చిరు మద్దతు తెలిపి, కాపు రిజర్వేషన్లకు ఒత్తాసు పలుకుతున్నప్పటికీ పవన్ మాత్రం ముద్రగడను దూరంగా పెడుతూ వస్తున్నాడు. ఇక 'ప్రజారాజ్యం' పార్టీ ద్వారా తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, ఆ తప్పులు, తొందరపాటు చర్యలు తీసుకోనని ఆయన ఇప్పటికే పలుసార్లు సూటిగా, కొన్నిసార్లు నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు.
కాగా ఇప్పుడు మరో మెగాబ్రదర్ నాగబాబు కూడా ఓ వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నెంబర్ 150' చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు, విజయం చూసి తాను నిజంగా షాకయ్యానన్నాడు. చిరంజీవిని హీరోగా అందరూ ఆదరిస్తున్నారని ఆయన ఒప్పుకున్నాడు. అదే సమయంలో చిరంజీవిని రాజకీయంగా వ్యతిరేకించిన వారు కూడా సినిమాలలో చిరుని అందరివాడిగా భావిస్తున్నారన్నాడు. చిరు రాజకీయాలలోకి వెళ్లితే అతను కేవలం 'కొందరివాడు'గా మిగిలిపోతాడని తాను ముందే వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశాడు. ఇక 'ప్రజారాజ్యం' పార్టీ వైఫల్యంలో తన పాత్ర కూడా ఉందని ఆయన అంగీకరించాడు. మరి ఈ వాస్తవాలు చిరు కూడా గమనించే ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి పెడుతూ, రాజకీయలకు దూరంగా ఉంటున్నాడా? ఆయన కూడా తాను రాజకీయంగా అందరివాడిని కాలేకపోయాననే వాస్తవాలను గ్రహిస్తున్నాడా? తన రాజకీయ వైఫల్యానికి కారణమైన స్వీయ తప్పిదాలను ఆయన గుర్తించాడా? లేదా? అనేది ఆయన భవిష్యత్తు నిర్ణయాలపై ఆధారపడి ఉందనే చెప్పాలి. తప్పులు చేయడం మానవ సహజం. కానీ ఆ తప్పులను, విమర్శలను కూడా పాజిటివ్‌గా తీసుకుని, వాటిల్లోని వాస్తవాలను గుర్తించి ముందుకు వెళ్లే వారికే భవిష్యత్తు ఉంటుంది.