చారిత్ర కథలను ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తే.. అది ఒక డాక్యమెంటరీ అవుతుంది. కోట్లాది రూపాయలతో చిత్రాలు తీసే వారు ప్రతి కథను తమకున్న, తమకు తెలిసిన, తాము పరిశోధించిన విషయాలకు కాస్త కాల్పనికత జోడించి సినిమాలను తీయడం సహజమే. దానికి ఎవ్వరూ అతీతులు కాదు.. స్వర్గీయ ఎన్టీఆర్ తీసిన, తానే దర్శకత్వం వహించిన, తానే నటించిన పలు చిత్రాలు కూడా వాటికి మినహాయింపు కాదు. కర్ణుడు, ధుర్యోధనుడు, రావణాసరుడు వంటి నెగటివ్ పాత్రలను కూడా పురాణాలపై తనకున్న పరిజ్ఞానంతో అందరికంటే విభిన్నంగా ఆలోంచి ఆయన ఆయా చిత్రాలను తీశాడు. ఇవి ఎన్నో ప్రశంసలనుపొందాయి. ఇక ఆయన చేసిన 'మాయాబజార్' ఓ కళాఖండం. కానీ అది కూడా కేవలం కల్పిత కథ మాత్రమే. 'లవకుశ, నర్తనశాల' కూడా అంతే. ఇక యముడిని విలన్‌గా, జోకరుగా చూపిస్తూ ఆయన చేసిన 'యమగోల', చిరంజీవి నటించిన 'యముడికి మొగుడు', జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'యమదొంగ', తెలుగులో అలీ హీరోగా, హిందీలో వెంకటేష్ చేసిన 'యమలీల' చిత్రాలు కూడా అవే కోవకి చెందినవి. కృష్ణ తీసిన 'కురుక్షేత్రం, అల్లూరి సీతారామరాజు' వంటి చిత్రాలు కూడా అంతే.
వాస్తవానికి చాలామంది ప్రజలు యముడిని కూడా దేవునిగా కొలుస్తారు. అలాంటి పాత్రను జోకర్‌ని చేయడం కూడా తప్పే. ఇక ఎంతో పరిశోధించి తీశామని చెప్పే నాగార్జున నటించిన 'అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి'లతో పాటు రాబోయే 'ఓం నమోవేంకటేశాయ' చిత్రం కూడా అదే కోవకి చెందినదే. ఇక బాలకృష్ణ చేసిన 'పాండురంగడు, గౌతమీపుత్ర శాతకర్ణి'లతో పాటు ఆయన దర్శకత్వం వహించాలని భావించి, మద్యలో వదిలేసిన 'నర్తనశాల' కూడా అంతే. గుణశేఖర్ 'రుద్రమదేవి, బాలరామాయణం', బాపు తీసిన 'రామాయణం' వంటివి కూడా అదే కోవవే. ఇంతెందుకు... క్రీస్తు మీద, బైబిల్ మీద వచ్చిన అనేక ఆంగ్ల చిత్రాలలో కూడా ఎంతో కాల్పనికత ఉంది. కాబట్టి ఇందులో పెద్దగా తప్పుపట్టాల్సిస విషయం లేదు. కానీ తాజాగా 'పద్మావతి' చిత్రంలో రాణి పద్మావతిని తప్పుగా చూపిస్తున్నారంటూ ఆ చిత్రం షూటింగ్‌పై దాడిచేసి, సెట్స్‌ను ద్వంసం చేయడంతో పాటు దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీని తీవ్రంగా కొట్టి ఇప్పటికీ తమది సరైన చర్యేనని చెబుతున్న ఆందోళనకారులు, వారికి మద్దతు ఇస్తున్న రాజస్థాన్ హోంమంత్రి, కేంద్రప్రభుత్వాల మౌనం చూస్తుంటే ఆందోళన కలగకమానదు.