ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో పవన్‌తో పాటు ఏపీ యువత చేస్తున్న ఉద్యమానికి పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా మద్దతు తెలిపి, బాసటగా నిలిచింది. ప్రత్యేకహోదా అనేది ఏపీ ప్రజల హక్కని, 68ఏళ్ల కిందట రాజ్యాంగం మనకు అనేక స్వేచ్చలు కల్పించిందని, కాబట్టి ఉద్యమం చేయడం ప్రజల హక్కని ఆమె పేర్కొంది. కాగా పవన్‌కళ్యాణ్ చేస్తోన్న ప్రత్యేకహొదా ఉద్యమం విషయంలో ఇప్పటివరకు మన హీరోయిన్లు కానీ, నటీమణులు గానీ నోరు మెదపకపోవడం గమనార్హం. జల్లికట్టుపై స్పందించిన హీరోయిన్లు ప్రత్యేకహోదా విషయంలో మౌనం వహించడం పలువురి ఆగ్రహానికి కారణమవుతోంది. కాగా ప్రస్తుతం సినిమా రంగంలోని కొందరిలో పోరాట స్ఫూర్తి రగులుతోంది. తాజాగా సంగీత దర్శకుడు, నటుడు ఆర్పీపట్నాయక్ పద్మ అవార్డుల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. దశాబ్దాలుగా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందిస్తున్న సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఈ ఏడాది కూడా పద్మ పురస్కారం రాకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కనీసం పద్మ అవార్దు జాబితాలో కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరును చేర్చకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాల మెడలు వంచేవరకు, మన ఆవేదనను ప్రభుత్వ పెద్దల చెవులకు చేరేవరకు గళం విప్పుతానని ప్రకటించారు. ఈ విషయంలో మీడియా కూడా తనతో కలిసి రావాలని ఆయన కోరడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.