గతంలో హీరో జగపతిబాబుతో 'నగరం నిద్రపోతున్న వేళ' అనే చిత్రాన్ని తీసిన దర్శకుడు ప్రేమ్‌రాజ్ తాజాగా 'శరణం గచ్చామి' అనే చిత్రాన్ని తీశాడు. కాగా కుల రిజర్వేషన్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సి.బి.ఎఫ్.సి నిరాకరించడం ఇప్పుడు సరికొత్త వివాదానికి కేంద్రబిందువుగా మారుతోంది. కాగా ఈ చిత్రం విడుదలైతే అన్నిచోట్లా శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుందని, కులపోరాటాలు చెలరేగుతాయని సెన్సార్‌బోర్డ్ తెలిపింది. దీనిపై ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ, తమ చిత్రంలో ఏమైనా డైలాగ్స్, సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉంటే వాటిని తొలగించడానికి సిద్దమని.. కానీ ఏకంగా సెన్సార్‌సర్టిఫికేట్‌ను నిరాకరించడం అన్యాయమన్నారు. ఈ చిత్రానికి తాము సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని ఆ కార్యాలయం నుండి తనకు తాజాగా ఉత్తరం వచ్చిందని ఆయన తెలిపాడు. ఈ చిత్రాన్ని ప్రస్తుతం కేంద్ర సెన్సార్‌బోర్డ్‌కు పంపించారు.
ఈ చిత్రం సెన్సార్ విషయమై ప్రాంతీయ సెన్సార్‌బోర్డు అధికారి రాజశేఖరంను మీడియా ప్రశ్నించగా ఈ చిత్రం సెన్సార్ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. అదే సమయంలో ఈ చిత్రం రాజ్యాంగంలోని పలు నిబంధలను ఉల్లంఘించే విధంగా ఉందని అధికారుల తమ లేఖలో పేర్కొనడం గమనార్హం. కాగా ఇలాంటి సమస్యలనే గతంలో వేజెళ్ల సత్యనారాయణ దర్శకత్వంలో రంగనాథ్ హీరోగా రూపొందిన 'ఈ చదువులు మాకొద్దు' అనే చిత్రం విషయంలో కూడా ఏర్పడిన విషయాన్ని సీనియర్ సినీ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ చిత్రంలో అగ్రవర్ణాలుగా పిలువబడే నిరుపేద కుటుంబాల యువత రిజర్వేషన్ల పేరిట తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపే విధంగా ఆ చిత్రం రూపొంది, విడుదలైన తర్వాత పలు కులసంఘాల ఆగ్రహానికి గురైంది. మరి ఈ తాజాగా 'శరణం గచ్చామి' చిత్రం విషయంలో తుది ఫలితం ఎలా ఉండబోతోంది? అనేది ఆసక్తిని కలిగిస్తోంది.