నేటి రోజుల్లో ఎవరి మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయో అర్ధం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఏమి మాట్లాడినా విపరీతార్దాలు తీస్తున్నారు. కాగా పవన్ కాకినాడ సభతో పాటు పలు సందర్బాలలో కేంద్రం మనం అడగక్కుండానే రెండు పాచిపోయిన లడ్డూలను మన చేతిలో పెట్టిందని, చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆ పాచిపోయిన లడ్డూలను మహాప్రసాదంగా తీసుకుందంటూ సెటైర్లు వేశాడు. ఆయన పలుసార్లు ఇవే మాటలను రిపీట్ చేశారు. ఇక తాజాగా 'దేశ్‌బచావో' ఆల్బమ్‌లో కూడా పవన్ చెప్పిన లడ్డూల గురించిన డైలాగ్‌లు బాగా వినపడ్డాయి. దాంతో ఇంకేముంది.. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ విమర్శలు మొదలయ్యాయి. పవన్ లడ్డూలను తయారుచేసి, అమ్మే వ్యాపారులను, లడ్డూలను, వాటిని తినే వారిని కించపరిచారనే వాదన మొదలైంది. దీంతో ఈ విమర్శలు పవన్ చెవికి కూడా చేరాయి. ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయడం ఇష్టంలేని పవన్ వెంటనే ఈ విషయమై ట్విట్టర్‌తో స్పందించాడు.
తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి అలా అనలేదని, కేవలం అడగకుండానే మన చేతిలో కేంద్రంపెట్టిన పాచిపోయిన లడ్డూలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశానని, అంతేగానీ లడ్డూలకు తాను వ్యతిరేకంగా కాదని ట్వీట్ చేశాడు. తనకు లడ్డూల మీద గానీ, వాటిని తయారు చేసే వారి మీదగానీ, వాటిని అమ్మేవారిపట్ల గానీ, చివరకు వాటిని తినే వారి పట్ల గానీ తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశాడు. అడగకుండా చేతిలో పాచిపోయిన లడ్డూలనుపెట్టిన వారిమీదనే తమ అసహనమంతా అని వివరణ ఇచ్చాడు. అంతేకాదు.. లడ్డూలు తినడం ఆరోగ్యానికి హానికరం కాదని ట్వీట్ చేయడం కొసమెరుపు. మరి ఇప్పుడైనా గాయపడిన మనోభావాలు మరలా పూర్వస్థితికి వస్తాయా? లేదా? లేక దీనిని మరింత రాజకీయం చేస్తారా? అనే విషయాలు వేచిచూడాల్సివుంది.