జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో శుక్రవారం ప్రెస్ మీట్ పెడతామని తెలియజేసి మరీ ప్రెస్ మీట్ జరిపాడు. అయితే ఈ ప్రెస్ మీట్ ద్వారా పవన్ ఏం వెల్లడించాడు అన్న విషయాన్ని ప్రస్తావించుకుంటే... పవన్ మొదటి నుండి ఎలాంటి పంథా అయితే అనుసరిస్తున్నాడో అలాంటి వైఖరినే నేడు కూడా అనుసరించినట్లు తెలుస్తుంది. యథావిధిగా ఎప్పటివలెనే.. ఇంకా కూడా.. ప్రత్యేక హోదా విషయంలో.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరినే చీల్చి చెండాడాడు.. దానికి ప్రతిగా రాష్ట్ర నాయకులు కేంద్రం తానా అంటే రాష్ట్రం తందానా అంటున్న వైఖరినీ ఎండగట్టారు. అంతవరకు బాగానే ఉంది. పవర్ స్టార్ లా పవన్ అనర్గళంగా వెంకయ్యపై విరుచుకు పడ్డాడు, ఉత్తరాధి ఆధిపత్య ధోరణిపై మాట్లాడాడు... నిన్న వైజాగ్ లో యువత చేపట్టిన శాంతియుత నిరసనను అణచివేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవలంభించిన వైఖరిపై కూడా పవన్ విరుచుకుపడ్డాడు. జాతీయ పత్రికల్లో బేనర్ ఐటంస్ గురించి వ్యాఖ్యానించినా, రాష్ట్ర ప్రభుత్వం యువతపై, నాయకులపై, నిరసనకారులపై ప్రభుత్వం తీసుకున్న నిన్నటి చర్యలపై పవన్.. పాలసీలతో పాలించండి, పోలీసులతో కాదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. ఇంకా ఎన్నో విషయాల్ని, సామాజిక, నైతికపరంగా పవన్ మాట్లాడాడు గానీ... ప్రభుత్వంపై అంత వాడి వేడిగా ఘాటైన విమర్శలు చేయలేదని యువతను ఉత్సాహపరిచేలా తగిన ప్రోత్సాహకమైన ప్రసంగం కానీ పవన్ నుండి ఆశించినంతగా లేదని యువత కాస్త డీలా పడిపోయింది. ఇటువంటి సమయంలో పవన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రత్యేకమైన వ్యక్తిగా తనదైన వాడిని చూపుతారనుకున్న ప్రజలు అటువంటి నిర్ణయాలేవీ పవన్ తీసుకోకపోవడం ఎంతైనా శోచనీయం.
ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా పవన్ నుండి ప్రజలు కోరుకున్నది ఇది కాదు. అసలు పవన్ లో మునుపటి వలెనే అంతటి స్థాయి వేడిగానీ ఏమాత్రం ప్రదర్శించలేదనే చెప్పాలి. ఇంకా ప్రత్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా ఆయన జరిపిన ప్రెస్ మీట్ లో రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న ప్రస్తుత తెదేపా ప్రత్యేక హోదా కంటే.. ప్రత్యేక ప్యాకేజీ ఎంతో గొప్పది అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న పార్టీ నేతలపైనా.. వైజాగ్ యువత విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై పవన్ కాస్త గట్టిగానే స్పందించినా... నిన్న జరిగిన పరిణామాలకు, ప్రభుత్వ వైఖరిపై పవన్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి సరైన నిర్ణయం తీసుకుంటారనే ప్రజలంతా ఎదురు చూశారు. నిజంగా ప్రభుత్వానికి, ప్రజానేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది అని చెబుతున్న పవన్, ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారన్న విషయం స్పష్టంగా తెలియజేశాడు. తాను.. పవన్ గతంలో ఎటువంటి పరిస్థితుల్లో భాజపా, తెదేపాలకు మద్దతిచ్చాడన్న విషయాన్ని తెల్పిన పవన్, ఆ తర్వాత ఆ పార్టీ నాయకులే తనను అపరిచితులుగా చూస్తున్నారన్న విషయంపై కూడా ఘాటుగా స్పందించాడు. పవన్ ఈ మధ్య కాలంలో ట్వీట్లలో చెలరేగి పోయిన అంశాలనే చాలా వరకు తాను ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించాడు. ఆ తర్వాత వైజాగ్ శాంతి నిరసన వంటి అంశాలతో ఆవేదనకు లోనైన పవన్ తాను చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాడనే ప్రజలంతా ఆశించారు. ఇన్ని రోజులుగా అంతటి ప్రభావశీలమైన వ్యక్తి కాదు ఓ శక్తి ఇంకా అదే తరహాలో మాట్లాడుతూ ఉండటాన్ని ఆంధ్రప్రదేశ్ యువత జీర్ణించుకోలేక పోతుంది. అంతే కాకుండా పవన్ నుండి ఇంతకు మించి ఆశించడం దండగా ఏంటి? అనే నిర్ణయానికి రావలసి వస్తుందా అని పరిస్థితులను బట్టి యువత అర్థం చేసుకోవలసి వస్తుంది. ఇకనైనా పవన్ ఓ పోరాట యోథుడుగా ప్రజల్లోకి వచ్చి సరైన నిర్ణయం తీసుకొని ప్రత్యేక హోదా కోసం ప్రణాళికా బద్ధంగా పోరాటం చేస్తే ప్రజల్లో ఓ బలమైన నాయకుడుగా ఆంధ్రప్రదేశ్ కు ఓ దిక్సూచిలా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతటి ప్రభావ వంతమైన పాత్రను ఆంధ్రాలో పవన్ పోషించాలని కోరుకుంటున్నారు ప్రజలు కూడాను. అలాంటి పోరాటం చేస్తే పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ శక్తి అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.