మంచు మనోజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరోడు'. ఈ చిత్రం ద్వారా సత్య అనే దర్శకుడు పరిచయం అవుతుండగా, ఇందులో మనోజ్ సరసన ప్రగ్యాజైస్వాల్ నటిస్తోంది. మరోపక్క ఈ చిత్రం ఆడియోని జనవరి 26న విడుదల చేయాలని భావించారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న 'ప్రత్యేక హోదా' ఉద్యమానికి మద్దతుగా ఈ చిత్రం ఆడియోని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోను ఈనెల 29న హైదరాబాద్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ ఆడియో వేడుకకు మెగామేనల్లుడు సాయి ధరమ్‌తేజ్, నేచురల్‌స్టార్ నాని, అప్‌కమింగ్‌స్టార్ శర్వానంద్‌లతో పాటు టాప్‌హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌లు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఏపీలో జరిగిన 'ప్రత్యేకహోదా' ఉద్యమానికి మద్దతుగా 'గుంటూరోడు' చిత్రం ఆడియోను వాయిదా వేసిన మంచు ఫ్యామిలీ... మరో మంచు హీరో అయిన విష్ణు, హన్సిక జంటగా నటిస్తున్న 'లక్కున్నోడు' చిత్రాన్ని మాత్రం ఫిబ్రవరి3 నుండి 'ఎస్3' వాయిదాతో హడావుడిగా ఓ వారం ముందుకు తీసుకొచ్చి జనవరి 26న భారీ ఎత్తున విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీపై అంత ప్రేమ ఉంటే ఈ చిత్రం విడుదల తేదీని కూడా వాయిదా వేయవచ్చు కదా...! దీనికి ఏం సమాధానం చెబుతారు? అంటూ కొందరు మంచు ప్యామిలీని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అదే మాయ.. మంచు వారి మాటలకు, చేతలకు ప్రతిదానికి అంతర్గతంగా ఓ అర్థం, పరమార్ధం ఉంటాయనే విమర్శలు గుంటూరు మిర్చి కన్నా ఘాటుగా వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలు మంచు ఫ్యామిలీ చెవులకు చేరాయా? చేరినా చేరనట్లుగా వ్యవహరిస్తున్నారా? అనేది ప్రశ్నార్ధకం.