విశాఖ పట్టణం... ఇప్పుడు అందరి చూపు వైజాగ్ వైపే.. విశాఖలోని అందాల ఆర్కే బీచ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం జరిపే శాంతియుత ఉద్యమానికి వేదికైంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుండి యువత మొత్తం విశాఖలోని శాంతియుత ఉద్యమంలో పాల్గొంటున్నారు. వీరి ఉద్యమానికి తాను మొదటి నుండి రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తున్నానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలిసి పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్వేగంతో ముందుకొచ్చాడు. అయితే వీరంతా కలిసి చేపట్టబోయే ఈ కార్యక్రమానికి అనుమతి ఏమాత్రం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భీష్మించుకు కూర్చుంది.
ఇలా పవన్ కల్యాణ్, జగన్, చంద్రబాబు వీరు ముగ్గురిలో ఎవరు ఈ ఉద్యమంతో మైలేజ్ సాధిస్తారు. ఎవరు కుదేలై పోతారన్నదానిపై అందరి చర్చా నడుస్తుంది. విశాఖలోని శాంతియుత ఉద్యమం దాని తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉన్నాసరే... తాను ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా విశాఖ బీచ్‌కు వెళ్ళి యువత శాంతియుతంగా జరిపే ఉద్యమంలో పాల్గొంటానని జగన్ ప్రకటించాడు. కానీ.. ఈ మధ్య వరుస ట్వీట్లతో చెలరేగి పోయిన పవన్ కల్యాణ్ శాంతియుత నిరసనలో పాల్గొంటాడా? లేడా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక రకంగా ఆర్కే బీచ్ శాంతియుత నిరసనపై ఇంత హడావుడి చేసిన పవన్ తీరా నిరసన కార్యక్రమానికి హాజరుకాకపోతే ప్రజలను ప్రత్యక్షంగా మోసం చేస్తున్నట్లవుతందని ప్రజలు భావించే అవకాశం కూడా లేకపోలేదని పవన్ కళ్యాణ్ అనుకుంటే ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.
సహజంగా రాష్ట్రంలో ఏదైనా చిక్కు సమస్య వచ్చిపడ్డప్పుడు.. దాన్ని పరిష్కరించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపి సామరస్యంగా దాని నుండి బయటపడుతుంటాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు కాపు ఉద్యమానికి ముద్రగడ సిద్ధమౌతున్న సమయం. మరోవైపు.. జగన్ ప్రత్యేక హోదాపై పోరాటానికి పెద్ద ఎత్తున స్వరం పెంచుతున్న సమయంలో జగన్ కు చెక్ పెట్టేందుకు చంద్రబాబే స్వయంగా పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపుతున్నాడా? అనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఎందుకంటే గతంలో జరిగిన అనేక పరిణామాల దృష్ట్యా ఇటువంటి అలోచన ప్రజల్లో కలుగుతుంది. పవన్ కళ్యాణ్ అనే ఒక్క బుల్లెట్ తో అటు ముద్రగడను, ఇటు జగన్ ను చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తుంది. నిజంగా వీరిద్దరినీ నిరోధించేందుకు చంద్రబాబే, పవన్ కళ్యాణ్ అనే బాణాన్ని సంధిస్తున్నాడేమోనని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
కానీ... ఇప్పుడు పవన్, బాబుల ఎత్తులకు జగన్ పైఎత్తు వేసినట్లుగానే తెలుస్తుంది. ఈ మధ్య వరుస ట్వీట్లతో ఇంత హడావుడి చేసిన పవన్ గతంలో మాదిరిగానే ఇప్పుడు పవన్ కల్యాణ్ వెనక్క తగ్గలేని పరిస్థితిని జగన్ సృష్టించాడు. దేనికైనా రెడీ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్దాం అంటూ ముందుకు దుముకుతున్న జగన్ కు ప్రతిగా పవన్ ఏ మాత్రం వెనకడుగు వేసినా ప్రజల్లో పవన్ గురించి వ్యతిరేక ఆలోచనలు మొలకెత్తడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది జనసేనానికి అగ్ని పరీక్ష లాంటిదే. నిజంగా పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రతి పనిలోనూ నైతికత ఉంది అని ప్రజలు భావించాలంటే రాజకీయాలకు అతీతంగా పవన్ నైజాన్ని తేట తెల్లపరచవలసిన అవసరం ఇప్పుడు ఆసన్నమైంది. అటు ప్రభుత్వం కూడా చిక్కు సమస్యగా మారిన ఈ సందర్భాన్ని ఎలా ఆలోచించాలో తెలియక సతమతమౌతున్నట్లుగానే ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం నిషేధాజ్ఞలు, బెదిరింపులు, కర్ఫ్యూలు, పోలీస్ ఫైరింగ్ లు జరిపితే.. ఇలాగే కొనసాగిస్తే.. ప్రజా వ్యతిరేకత దారుణంగా మూటకట్టుకోవడం ఖాయమన్న విషయం తెలిసిందే. ఇలా శాంతియుతంగా జరిగే నిరసనకు భంగం కలిగిస్తే ముందు ముందు హోదా కోసం పెద్ద ఎత్తున మహోద్యమం రాకపోదు అనే విషయంపై కూడా ఆలోచించాల్సిన తరుణం ప్రభుత్వంపై ఉంది. ఇలా ఆంధ్రాలో అధికారమే పరమావధిగా రాజకీయాలు నెరపే చంద్రబాబు, పవన్, జగన్ ల మూడు ముక్కలాటలో ఎవరు ఎంత మైలేజ్ ను సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.