నిన్న బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్‌ఖాన్ నటించిన 'రాయిస్', గ్రీకువీరుడు హృతిక్‌రోషన్ నటించిన 'కాబిల్' చిత్రాలు విడుదలయ్యాయి. 'కాబిల్' చిత్రానికి మంచి ప్రశంసలు దక్కుతుండగా, 'దిల్‌వాలే, ఫ్యాన్' చిత్రాలతో నిరాశపరిచిన షారుఖ్ 'రాయిస్' మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని అద్భుతమైన ఓపెనింగ్స్ సాధిస్తోంది. కాగా 'రాయిస్'చిత్రం రంజాన్‌లో విడుదల కావాల్సివుండగా, 'కాబిల్'ను మాత్రం చిత్రం ప్రారంభం రోజే జనవరి25ను రిలీజ్ డేట్‌గా ప్రకటించారు. కానీ రంజాన్ మాసంలో తమ మతవర్గమైన సల్మాన్ 'సుల్తాన్'కు దారి ఇచ్చిన షారుక్ 'రాయిస్'ను అనుకోకుండా 'కాబిల్'తో పోటీకి దింపాడు. విధిలేని పరిస్థితుల్లో 'కాబిల్' చిత్రం కూడా ఇదే రోజున రిలీజైంది. మరో విచిత్రం ఏమిటంటే 'రాయిస్' చిత్రానికి షారుఖ్ భార్య గౌరీ నిర్మాత కాగా, 'కాబిల్'కు హృతిక్ తండ్రి రాకేష్‌రోషన్ నిర్మాత. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలకు సిద్దం కావడంతో థియేటర్ల కోసం పోటీ ఎక్కువైంది.
ఇద్దరు బడాస్టార్సే కావడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఎంతో టెన్షన్ అనుభవించారు. దీంతో దేశవిదేశాల్లో సైతం ఈ చిత్రాన్ని 50:50 నిష్పత్తిలో సమానంగా థియేటర్లు తీసుకోవాలని షారుఖ్, హృతిక్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ షారుఖ్ తనకున్న పవర్‌తో చివరి క్షణాల్లో రాజకీయం చేసి 'రాయిస్'కు 60శాతం థియేటర్లు దొరికేలా ఎగ్జిబిటర్లను మభ్యపెట్టి లబ్దిపొందాడు. దీంతో తక్కువ థియేటర్లలో 'కాబిల్' విడుదలైంది. దీనిపై రాకేష్‌రోషన్ మీడియా ముందు తన బాధను వెల్లగక్కాడు. ఓ పవర్‌ఫుల్ వ్యక్తి తన పవర్‌తో తమను మోసం చేసి, ఒప్పందాన్ని ఉల్లంఘించాడని, దీనివల్ల తమ చిత్రానికి 150కోట్ల వరకు నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా మోసపూరితంగా కుట్రలు చేస్తే ఇక తాను సినిమా రంగంలో కూడా ఉండనని కన్నీటిపర్యంతం అయ్యాడు. ఇక 'కాబిల్' చిత్రాన్ని హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రం 'బలం' పేరుతో రిలీజైంది. చిత్రం విడుదలకు ముందు మూడునెలల కిందటే డబ్బింగ్‌పనులు పూర్తి చేసి, ఇక్కడ కూడా భారీ ప్రమోషన్లు నిర్వహించారు.
తమిళనాడులో ఈ చిత్రానికి హృతిక్‌కు గురువు, రాకేష్‌కు మంచి స్నేహితుడైన రజనీ రాష్ట్రంలో 120 థియేటర్లు లభించేలా కృషి చేసి విజయం సాధించాడు. కానీ తెలుగులో మాత్రం సంక్రాంతికి విడుదలైన చిత్రాల హీరోలు, నిర్మాతలు 50రోజుల వరకు థియేటర్లను బ్లాక్ చేయడం, విష్ణు 'లక్కునోడు'కి కూడా ఎక్కువ థియేటర్లు లభించేలా మోహన్‌బాబు పావులు కదపడంతో 'బలం' (కాబిల్)కు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ నామమాత్రంగా మాత్రమే థియేటర్లు లభించాయి. మొత్తానికి ఇండస్ట్రీలు కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో సైతం కేవలం ఒకరిద్దరి చేతుల్లో ఉండిపోవడం దారుణమని ఎందరో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క 'రాయిస్' చిత్రంలో షారుఖ్ బాగా నటించినప్పటికీ సెకండాఫ్‌లో ఆయనను ఏసీపీగా చేసిన నవాజుద్దీన్ సిద్దిఖా డామినేట్ చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.