కోలీవుడ్, టాలీవుడ్‌లలో మంచి క్రేజ్ ఉన్న వెర్సటైల్ స్టార్ సూర్య. కాగా గత కొంతకాలంగా ఈ హీరోకు సరైన బ్లాక్‌బస్టర్ పడలేదు. విభిన్న చిత్రాలను చేస్తున్నప్పటికీ సరైన హిట్ రావడం లేదు. ఆయన నటించిన '24' చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. కానీ తమిళంలో మాత్రం ఈ చిత్రం యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. దాంతో తనకు కష్టకాలలో 'సింగం' సిరీస్‌లతో మంచి బ్లాక్‌బస్టర్స్ ఇస్తున్న దర్శకుడు హరినే ఈ సారి సూర్య నమ్ముకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సింగం సిరీస్‌లో భాగంగా మరోసారి పవర్‌పుల్ పోలీసాఫీసర్‌గా సూర్య గర్జించనున్నాడు. 'ఎస్3' (యముడు3) గా, తమిళంలో 'సి3'గా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌పతాకంపై జ్ఞానవేల్‌రాజా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
కాగా ఈ చిత్రాన్ని వాస్తవానికి దీపావళి కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ సూర్య సోదరుడు కార్తి నటించిన 'కాష్మోరా' చిత్రం కోసం వాయిదా వేశారు. డిసెంబర్‌లో సూర్య మంచితనం పుణ్యమా అని రామ్ చరణ్-అల్లు అరవింద్‌ల 'దృవ' కోసం ఈ చిత్రం విడుదలను వాయిదా వేయించారు. ఇక అమ్మ జయలలిత మరణం, సానుభూతి పవనాలు, వరదలు, తాజాగా జల్లికట్టు ఉద్యమం కారణంగా ఈ చిత్రం విడుదల వినాయకుడి పెళ్లెప్పుడంటే రేపే' అన్నచందంగా మారిపోతూ వస్తోంది. జనవరి 26న అంటే ఈ రోజున విడుదల కావాల్సిన ఈ చిత్రం 'జల్లికట్టు' ఉద్యమం ముగిసిపోయినప్పటికీ ఇప్పటికీ తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో ఇంకా నిరసనలు జరుగుతున్న కారణంగా వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ చిత్రానికి ఫిబ్రవరి 9న విడుదల తేదీని ప్రకటించి, తెలుగులో కూడా నేడు పలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు.
మరోపక్క 10వ తేదీన నాగార్జున తన మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో విజువల్స్‌కు పెద్ద పీట వేయడంతో తాను చెప్పే వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయవద్దని నాగ్ నిర్మాతలను ఆదేశించాడు. కానీ దర్శకుడు రాఘవేంద్రరావుతో పాటు యూనిట్ కూడా ఈ చిత్రాన్ని పిబ్రవరి10న విడుదల చేస్తామని తెలిపారు. నేడు పలు దినపత్రికల్లో ఈ చిత్రం త్వరలో విడుదల అని ప్రకటనలు వేశారే గానీ ఫిబ్రవరి10న విడుదల అనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్‌తో సహా అంతా పూర్తయింది. ఫిబ్రవరి 9న 'ఎస్3' విడుదలను మరో వారం వాయిదా వేసుకోవాలని నాగ్ ఈ చిత్ర తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తున్న పేరులేని అనామకుడైన మల్కాపురం శివకుమార్‌ను సంప్రదించగా, ఇప్పటికే ఈ చిత్రం పలు సార్లు వాయిదా పడటంతో తాను ఆర్ధికంగా ఎంతో నష్టపోయనని, తన అడ్వాన్స్‌ను తిరిగి జ్ఞానవేల్‌రాజా తనకు ఇచ్చేలా నాగ్ చేస్తే తాను ఈ చిత్రం నుంచి పూర్తిగా తప్పుకుంటానని తెలిపాడట.
దాంతో నాగ్ సూర్య, జ్ఞానవేల్ రాజాలను ఫోన్‌లో సంప్రదించినప్పటికీ ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని, మరోసారి వాయిదా వేయలేమని, అలా చేస్తే తెలుగు విషయాన్ని పక్కనపెడితే, తమిళంలో తమకు పలు చిక్కులు వస్తాయని చెప్పారట. మంచి కోసం పోతే.. అన్న సామెత చందంగా తమ పరిస్థితి ఉందని నాగ్‌కు తెలిపారట. దాంతో నాగ్ తన చిత్రం రిలీజ్ డేట్ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకుండా ఈ రోజు ప్రకనటల్లో త్వరలో అనే వేయించాడని, మరో ఒకటి రెండు రోజుల్లో తేదీని అఫీషియల్‌గా ప్రకటిస్తాడని అంటున్నారు.