నిన్నమొన్నటివరకు మినిమం గ్యారంటీ హీరోలంటే మాస్ మహారాజాగా ఎదిగిన రవితేజ, అల్లరి నరేష్, రామ్ వంటి హీరోలను ఎక్కువగా చెప్పుకునే వారు. నిర్మాతలు కూడా ఈ హీరోలను ఎక్కువగా తమ సినిమాలలో పెట్టుకోవాలని ఉబలాటపడేవారు. కాస్త అటు ఇటుగా దశాబ్దం నుంచి ఇదే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. రవితేజతో సినిమా చేయాలంటే కనీసం 15నుంచి 20కోట్ల వరకు బడ్జెట్ అవుతోంది. సినిమా మంచిహిట్టయినా కూడా 25 నుంచి 30కోట్ల వరకు మాత్రమే ఆయన పరిమితమయ్యాడు. కానీ ప్రస్తుతం యువహీరోలైన నాని, సాయిధరమ్‌తేజ్, శర్వానంద్, నిఖిల్, రాజ్‌కిరణ్ వంటి హీరోలు ఆ స్థానాలపై కన్నేశారు.
వీరితో మహా అయితే 10కోట్లు బడ్జెట్ సరిపోతుంది. నాని విషయానికి వస్తే 'భలే భలే మగాడివోయ్'తో దాదాపు 25కోట్లు దాటిన ఆయన చిత్రాలు ప్రస్తుతం స్టడీగా 20కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక 'రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్‌రాజా' వంటి చిత్రాలతో 15కోట్లకు చేరువైన శర్వానంద్, తాజా చిత్రం 'శతమానం భవతి' 25కోట్ల దిశగా సాగుతోంది. అతి తక్కువ చిత్రాలతోనే 20కోట్ల మార్కెట్‌ను అందుకున్న సాయి కూడా దూసుకుపోతున్నాడు. హిట్టయితే ఏకంగా 10కోట్ల పెట్టుబడికి రెండింతలు లాభం ఖాయం. ఇక వరుస హిట్స్ మీద ఉన్న నాని ఇంతకాలం వెరైటీ చిత్రాలు చేస్తూ వస్తున్నప్పటికీ తాజాగా ఆయన చేసిన మాస్‌ఎంటర్‌టైనర్ 'నేను.. లోకల్'లో ఆయన గెటప్‌ను చూస్తుంటే నాటి రవితేజ 'ఇడియట్'లా కనిపిస్తున్నాడంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో కొందరు పాత హీరోల పరిస్థితి ఇప్పుడు డైలమాలో పడుతోంది.