గతంలో రజనీ నటించిన చిత్రంతో పాటు పలు చిత్రాలలో డబ్బులు ఎలా ఖర్చుపెట్టాలో తెలియక కొందరు చెత్త హీరోలతో, దర్శకులతో చెత్త అనిపించిన సినిమాలు తీసి, డబ్బును ఎలా పోగొట్టుకోవాలా? అని ఆలోచిస్తుంటే.. ఆయా చిత్రాలు హిట్ అయి మరిన్ని డబ్బులు వచ్చే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో పేదవారు ఎక్కువగా ఉన్నా.. ఇక్కడ డబ్బంటే లెక్కలేని కోటీశ్వరులు కూడా అధికమేనని, దేశ సంపద అంతా కొందరి చేతుల్లోనే ఉందని అనేక సర్వేలు చెబుతున్న మాట వాస్తవం. అలాంటి వారిలో సీనియర్ పొలిటీషియన్, సినీ నిర్మాత, కళాబంధు అనే బిరుదుతో పాటు తన ఇమేజ్ కోసం డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టి, పార్టీలకు అతీతంగా అందరితో కలిసి ఉండే బడా కాంట్రాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ఒకరు. ఆయన గతంలో చాలా చిత్రాలే తీశాడు. ఆయన కోరికకు అనుగుణంగా అందులో ఎక్కువ చిత్రాలు నష్టాలనే మిగిల్చాయి. దాంతో పాటే ఆయన మరో మంచి పని కూడా చేశారు. 'వివేకానంద, భగవద్గీత' వంటి అవార్డులు మాత్రమే వచ్చే కళాఖండాలను తీశాడు. ఈ చిత్రాలు డబ్బులు రాబట్టలేకపోయినా ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. ఎప్పుడు ఏయన్నార్‌కు సన్మానం చేయాలా? ఎప్పుడు మోహన్‌బాబుకు పురస్కారం ఇవ్వాలా? అనేదే ఆయన తపన.
కాగా విశాఖ నుంచి ఎంపికై తన సొంత డబ్బునే ఎన్నికల్లో ఖర్చుపెట్టడమే కాదు.. ఏకంగా తనకు టిక్కెట్ ఇచ్చిన పార్టీలకే కాదు.. ఆయా ప్రతిపక్షాలకు కూడా భారీ విరాళాలు ఇవ్వడం ఈయనకు పరిపాటి. కాగా గతంలో చిరుతో 'స్టేట్‌రౌడీ' తీసిన ఆయన 9ఏళ్ల తర్వాత చిరు రీఎంట్రీ ఇస్తే ఊరకే ఉంటాడా? దాంతో ఏకంగా చిరుకు సతీసమేతంగా భారీ సత్కారం చేశాడు. ఈ వేడుకకు చిరు, సురేఖ, రామ్‌చరణ్, ఉపాసన, నాగార్జున, చార్మి, పరుచూరి బ్రదర్స్, బి.గోపాల్, వినాయక్, అఖిల్, అల్లు అరవింద్‌తో పాటు పలువురు హాజరయ్యారు. చిరు దంపతులను ఆయనే సత్కరించగా, నిర్మాతగా తొలి చిత్రం తీసిన రామ్‌చరణ్‌కు నాగ్ చేతుల మీదుగా సన్మానం చేయించాడు. ఈయన గతంలో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి, ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఏయన్నార్, మోహన్‌బాబు వంటి వారిని హడావుడిగా నెల్లూరుకి పిలిచి , మోహన్‌బాబుకు ఏయన్నార్ అవార్డును అందించి, ఇంత మంది సీనీ నటులను నెల్లూరు తెప్పించిన ఘనత తనదేనని, కాబట్టి భవిష్యత్తులో కూడా వైజాగ్ తరహాలో నెల్లూరును అద్భుతంగా తీర్చిదిద్దుతానని ప్రకటించినా, డబ్బును ఎన్నికల్లో నీళ్లగా ఖర్చుపెట్టినా భారీ తేడాతో ఓడిపోయాడు. మొత్తానికి ఈయన మరోసారి చిరుకు 'ఖైదీనెంబర్150' చిత్రానికి సక్సెస్‌మీట్‌లా 'ఆత్మీయ వేడుక' పేరుతో ఈ సభ నిర్వహించాడు. అంతేకాదు.. త్వరలో తాను మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌లతో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మిస్తానని కూడా ప్రకటించాడు. నిజమే.. ఉన్న డబ్బు పోగొట్టుకోవాలంటే... అన్నింటి కంటే ఇదే సులభమైన మార్గం అని సెటైర్లు వినిపిస్తున్నాయి. దాంతో ఆయనకు నచ్చే, బాగా ఖర్చుపెట్టే దర్శకుడు బి.గోపాల్‌లో మరలా ఆశలు రేకెత్తించాడు.