గత ఎన్నికల్లో 'జనసేన' పార్టీని స్థాపించి, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పోటీ చేసే విధంగా చేస్తానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా పవన్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మరోసారి మాట తప్పుతున్నాడా? అనే అనుమానం రాకమానదు. ఆయన ఇటీవల 'నేను టిడిపి, వైయస్సార్‌సీపీలకు పోటీగా వెళ్లదలుచుకోలేదు. పార్టీని స్థాపించిన కేవలం రెండేళ్లలో వాటితో పోటీపడదలుచుకోలేదు. 'జనసేన'ను నింపడం, కమిటీలు వేయడంనాకు 10రోజుల పని. కానీ నాకంటూ కొన్ని లక్ష్యాలు, నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి' అని తెలిపాడు. దాంతో తెదేపా, వైసీపీ వంటి పార్టీలతో పోటీ పడి తొందరపాటుతో తన పార్టీని నిర్వీర్యం చేసుకొనే ఉద్దేశ్యం ఆయనకి లేదని అర్దమవుతోంది.
గతంలో అన్నయ్య స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీ నుంచి కూడా తాను పలు అంశాలను నేర్చుకున్నానని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరో వంక ఆయన రాష్ట్రంలోని ఏ సమస్య మీద స్పందించినా చంద్రబాబు ప్రభుత్వం దానికి బాగానే రియాక్ట్ అవుతోంది. తాజాగా ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. త్వరలో ఆయన ఫ్లోరోసిస్‌తో పాటు కిడ్నీ బాధితులుగా మారుతున్న ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణలోని నల్గొండ వంటి ప్రాంతాలలో కూడా పర్యటించాలని భావించాడు. కానీ జగన్ మాత్రం ప్రకాశం జిల్లాలో పవన్ కంటే ముందే పర్యటించి, అక్కడి కిడ్నీబాధితుల తరపున ఉద్వేగభరిత ప్రసంగం చేశాడు. మరి రేపు పవన్ ఆయా ప్రాంతాలల్లో కూడా పర్యటించి, ప్రభుత్వం నుండి స్పందన రాబట్టుకుంటే దానిని పవన్ కంటే ముందుగానే జగన్ తన ఖాతాలో వేసుకునే ఆలోచన చేస్తున్నట్లు అర్ధమవుతోంది.