సీనియర్ దర్శకుడు డా.దాసరి నారాయణరావు ఒక సినిమాను అభినందిస్తే తప్పకుండా దాని గురించి ప్రేక్షకులు ఆలోచిస్తారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఆయనది. తెలుగు సినిమా పోకడలను నిశితంగా గమనించే వ్యక్తి ఆయన. విడుదలైన సినిమాలపై స్పష్టమైన సమాచారం ఆయన వద్ద ఉంటుంది. సాంకేతిక నిపుణులు అంటే గౌరవం. అలాంటి దాసరి ఈ మధ్య చిన్న సినిమాలను అభినందించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆరోగ్యం సహకరించనప్పటికీ ఓపిక తెచ్చుకుని మరీ మీడియాను పిలిచి తన స్పందన తెలియజేస్తున్నారు. దాసరి వంటి పెద్దాయన ప్రశంసలు లభిస్తే యూనిట్ కు ఆనందం కలుగుతుంది. అయితే ఇటీవల దాసరి అభినందనలు అందుకున్న చాలా చిత్రాలు కమర్షియల్ గా మాత్రం నిలబడలేకపోతున్నాయి. కేవలం మంచి సినిమాగా మాత్రమే మిగులుతున్నాయి. డబ్బులు రానప్పుడు ప్రశంసలు సంతృప్తిని ఇవ్వవు.
దాసరి కితాబు నిచ్చారంటే ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారో గమనించవచ్చు. గతంలో దాసరి మనమంతా, అప్పట్లో ఒకడుండేవాడు, మిథునం, నిర్మలా కాన్వెట్, జయమ్ము నిశ్చయమ్మురా, మలుపు, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ వంటి చిత్రాలకు మంచి చిత్రాలుగా సర్టిఫికెట్ ఇచ్చారు. చిత్రంగా ఇవన్నీ కనీస విజయం సాధించలేకపోయాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.
అలాగే ఊపిరి, పెళ్ళిపుస్తకం వంటి సినిమాలు సైతం దాసరి అభినందనలు అందుకున్నాయి. ఇవి కమర్షియల్ విజయం పొందాయి. కాబట్టి దాసరి ప్రశంసలు కేవలం సాంకేతికంగా చూడాలని, వేరే దురుద్దేశం ఆపాదించవద్దని సినీ వర్గాలు అంటున్నాయి.