టాలీవుడ్ లో ఒకే ఫ్యామిలీలో ఎక్కువ మంది హీరోలున్న ఘనత చిరంజీవి కుటుంబానికే చెందుతుంది. చిరంజీవిని చూస్తూ పెరిగిన కుటుంబ సభ్యులంతా హీరోలు కావాలని ముచ్చటపడ్డారు. వారికి పెద్దాయన ఆశీస్సులు ఉండడంతో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ వీరంతా స్టార్స్ గా పరిచయమై సక్సెస్ అయ్యారు. వీరందరినీ ఒకే సినిమాలో చూడాలని మెగా అభిమానులు ఆశించడం సహజమే. పదేళ్ళ తర్వాత రీ ఎంట్రి ఇచ్చిన చిరు సినిమా ఖైదీ 150లో మెగా హీరోలందరూ కనిపిస్తారని ప్రచారం జరిగినా అది వర్కవుట్ కాలేదు.కేవలం చరణ్ మాత్రం కొద్ది సేపు మెరిసి అభిమానులను ఆనందపరిచాడు.
మెగా హీరోలంతా ఒకే సినిమాలో నటించడం సాధ్యమా? వీరందరినీ ఒప్పించగల సమర్థుడు ఎవరూ? అసలు వీరికి సరిపడే కథ దొరుకుందా ? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే మెగా హీరోలందరిని కలిపి సినిమా చేస్తానని ప్రముఖ పారిశ్రామిక వేత్త, చిరంజీవి సన్నిహితుడు టి.సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. దాంతో అభిమానుల్లో ఆశ చిగురించింది. నిజానికి అందరినీ ఒప్పించగల సమర్థుడు టిఎస్ఆర్. ఆయనకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రతి హీరోలతో నేరుగా, ముక్కుసూటిగా మాట్లడగలిగే కెపాసిటి ఆయనకు ఉంది. కాబట్టి టిఎస్ఆర్ ప్రయత్నం నెరవేరితే అది ఒక అద్భుతమే అవుతుంది.