ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో తన 151వ చిత్రాన్ని సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చారిత్రక కథాంశమైన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చేయాలని చిరు మొదట్లో భావించినప్పటికీ ఇప్పటికీ తనకు ఉన్న మాస్ ఇమేజ్ దృష్ట్యా సూరి దర్శకత్వంలోనే మరోపక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడని సమాచారం. ఇందుకోసం సూరీ తన మొదటి చిత్రం 'అతనొక్కడే' తర్వాత మరోసారి కుర్ర రచయితలతో కూర్చొని మరో పక్కా మాస్ సబ్జెక్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ స్టోరీలైన్ కూడా చిరుకు బాగా నచ్చిందట. దాంతో మార్చి నాటికి ఈ చిత్రం పూర్తి బైండెండ్ స్క్రిప్ట్‌ను సూరీ రెడీ చేసి, చరణ్ నిర్మాతగానే 151వ చిత్రాన్ని చరణ్ బర్త్‌డే కానుకగా ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం.
ఇక 152వ చిత్రాన్ని గీతాఆర్ట్స్ బేనర్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ ఏడాది చివరిలోనే ప్రారంభించాలని భావిస్తున్నారు. మరోవైపు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ 'కాటమరాయుడు', త్రివిక్రమ్ శ్రీనివాస్, నీసన్‌తో 'వేదాళం'రీమేక్, ఆపై దర్శకుడు శివ దర్శకత్వంలో మరో చిత్రం... ఇలా వరుస చిత్రాలను లైన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే. 'కాటమరాయుడు' చిత్రంలో మిడిల్‌ఏజ్‌డ్ పర్సన్‌గా కనిపించేందుకు బరువుపెరిగిన పవన్, త్రివిక్రమ్ కోసం బరువు తగ్గనున్నాడట. మరోవైపు రామ్‌చరణ్ 'ధృవ' ఇచ్చిన సక్సెస్‌తో ఫిబ్రవరి నుంచి సుక్కు చిత్రం ప్రారంభించనున్నాడు. ఇందులో ఆయన గడ్డం పెంచి గ్రామీణ యువకుడిగా మేకోవర్ కానున్నాడు.
ఇందులో మెయిన్ హీరోయిన్‌గా అనుపమ, సెకండ్ హీరోయిన్‌గా రాశిఖన్నా నటించనున్నారంటున్నారు. అదే జరిగితే ఈ ఇద్దరు హీరోయిన్లు నక్కతోక తొక్కినట్లే. మరోవైపు ఆ తర్వాత చేయబోయే రెండు చిత్రాలను చరణ్ ఓకే చేశాడు. కానీ ఎవరితో అనే విషయంలో సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు. ఇక 'సరైనోడు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆరునెలలు గ్యాప్ తీసుకొని బన్నీ దిల్‌రాజు-హరీష్‌శంకర్‌ల 'డిజె' చేస్తున్నాడు.ఈ చిత్రం షూటింగ్ ఆలస్యంగా మొదలైనప్పటికీ జెట్‌స్పీడ్‌తో సాగుతోంది. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో మరో ఊరమాస్ చిత్రం చేయనున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్, తమిళంలో స్టూడియోగ్రీన్ సంస్థలు నిర్మించనున్నాయి.
ఆ తర్వాత 'ఆర్య'తో సుకుమార్‌ను పరిచయం చేసిన బన్నీ ఇంతకాలానికి మరో కొత్త దర్శకునికి అవకాశం ఇస్తున్నాడు. టాప్‌రైటర్ వక్కంతం వంశీకి ఈ చిత్రంతో మెగాఫోన్ పట్టే అవకాశం ఇస్తున్నాడు. ఈ చిత్రంపై బన్నీ, వంశీలు ఇద్దరు ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయినా ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌లో కాకుండా సేఫ్‌జోన్ కోసం మరో నిర్మాతతో చేస్తాడని సమాచారం. వీటితో పాటు 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి'ల తర్వాత త్రివిక్రమ్-రాధాకృష్ణ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో బన్నీ నటిస్తాడని హారిక అండ్ హాసిని బేనర్ అధినేత రాధాకృష్ణ ఆల్‌రెడీ ప్రకటించాడు. కానీ ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమయ్యేది మాత్రం ఆయన తెలపలేదు. మొత్తానికి బన్నీ కూడా మరోసారి 'రేసుగుర్రం'లా మారి, మెగాహీరోలకు పోటీ ఇచ్చేందుకు, రేసులో ముందుండేందుకు ప్రణాళిక సిద్దం చేశాడు.