జూనియర్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి దర్శకనిర్మాతగానే కాదు.. హీరోగా కూడా మారి అభిమానుల చేత పీపుల్స్‌స్టార్‌గా పిలువబడే అత్యంత అరుదైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆర్.నారాయణమూర్తి. తాజాగా ఆయన జయసుధతో కలిసి చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చేసిన 'హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య' చిత్రం చిరు 'ఖైదీ..', బాలయ్య 'గౌతమీపుత్ర..', దిల్‌రాజు 'శతమానం...' చిత్రాలతో పోటీ పడి విడుదలైంది.ఈ చిత్రానికి థియేటర్లు దొరక్కపోవడంతో తమ చిత్రానికి కనీసం ఒక్కో పట్టణంలో ఒక్క థియేటర్‌నైనా కేటాయించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన చిత్రానికి థియేటర్ల కోసం స్వయాన రామోజీరావు రంగంలోకి దిగినప్పటికీ ఆయన పడ్డ కష్టానికి పెద్దగా ప్రతిఫలం దొరకలేదు. నైజాంలో దాదాపు 25 థియేటర్ల వరకు దక్కించుకున్న ఈ చిత్రానికి ఆంద్రా, సీడెడ్‌లలో మాత్రం థియేటర్లు లభించలేదు. ఈ విషయంలో ఆయన మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కేవలం తన సమస్య కాదని, చిన్న చిత్రాలను తీసే అందరి సమస్య అని, ఈ విషయంలో తనతో పాటు చిన్నచిత్రాలను తీసే వారందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని ఉద్వేగంగా మాట్లాడారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న మాత్రం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ఈ జనరేషన్‌లో మీకు నచ్చిన హీరో, దర్శకుడు ఎవరు? అన్న విషయంలో ఆయన ఎలాంటి డొంకతిరుగుడూ లేకుండా జవాబిచ్చారు. ఈతరం హీరోల్లో అన్ని తరహా పాత్రలను చేసి మెప్పించగలిగిన ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్ అని తెలిపారు. ఇక దర్శకుల్లో పూరీజగన్నాథ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన తీసే చిత్రాలు సూటిగా ఉంటాయని మెచ్చుకున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'టెంపర్' చిత్రంలో తనకు ఓ మంచి పాత్రకు అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ పాత్రను తాను చేయకపోయినా, వారిద్దరు తనకు ఆ అవకాశం ఇవ్వాలని భావించినందుకు పీపుల్స్‌స్టార్ కృతజ్ఞతలు తెలిపారు.