మెగాక్యాంపు హీరోలతో చిత్రాలు చేస్తే ఆ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించినా కూడా కేవలం హీరోలకే ఆ క్రెడిట్ మొత్తం దక్కేలా వారు ప్రణాళికలు వేస్తారనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. అందుకే క్రియేటివ్ జీనియస్‌లు అయిన మణిరత్నం, శంకర్ వంటి వారు మెగాహీరోలను ప్రిఫర్ చేయరని, అలాంటి కారణంతోనే ఆనాడు సూపర్‌ఫామ్‌లో ఉన్న వర్మ-చిరుల చిత్రం ఆగిపోయిందని కూడా ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇదే వివాదానికి చిరు అనుకోని విధంగా ఆజ్యం పోశాడా? అనే అనుమానం వస్తోంది. చిరంజీవికి ఎన్నో సూపర్‌హిట్స్ ఇచ్చి ఆయనను మెగాస్టార్‌గా మార్చిన సీనియర్ దర్శకులైన కోదండరామిరెడ్డి, విజయబాపినీడు వంటి దర్శకులను విమర్శకులు ఉదారణగా చూపుతుంటారు. ఇక తాజాగా చిరు తనకు స్టార్‌డమ్ తెచ్చిన 'ఖైదీ' చిత్రాన్ని ఇంకా బాగా తీసివుండవచ్చనే వ్యాఖ్యలు ఆయనకు నటునిగా జీవం పోసిన కోదండరామిరెడ్డిని కించపరిచేలా ఉన్నాయనే తేనెతుట్టను ఇప్పుడు యాంటీ మెగాఫ్యామిలీ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. 'మగధీర' చిత్రం విషయంలో కూడా రాజమౌళికి క్రెడిట్ దక్కకుండా ప్రయత్నాలు సాగించారని, అప్పటి నుంచి నిన్నటి బన్నీ 'సరైనోడు' దర్శకుడు బోయపాటి వరకు వారు ఎందరినో ఉదాహరణగా చూపుతున్నారు. ఇదే సమయంలో వారు పూరీ జగన్నాథ్ ఉదంతాన్ని కూడా ఉటంకిస్తున్నారు.
చిరు, పూరీతో 150వ చిత్రంగా 'ఆటోజానీ' చేయదలిచినా, ఫస్ట్‌పార్ట్ బాగున్నా సెకండ్‌హాఫ్ కథ నచ్చకపోవడంతో వదిలేశానని చిరు మీడియాకు చెప్పిన సందర్భంగా పూరీ ఈ విషయంపై మండిపడి, సెకండ్‌పార్ట్ నచ్చకపోతే... అందులోని మార్పులు చేర్పుల విషయం తనతో చెప్పాలే గానీ, మీడియాకు చెబితే సెకండ్‌పార్ట్ బాగైపోతుందా? అని చేసిన కామెంట్స్‌ను వారు రుజువులుగా చూపిస్తున్నారు. అదే సమయంలో తాజా చిత్రాలైన చిరు 'ఖైదీ', బాలయ్యల 'గౌతమీపుత్ర...' చిత్రాల ప్రమోషన్స్‌ను కూడా వారు ప్రస్తావిస్తున్నారు. బాలయ్య తన చిత్రం విజయం క్రెడిట్ మొత్తం దర్శకుడు క్రిష్‌కు చెందుతుందని చెప్పినన్పటికీ, 'కత్తి' రీమేక్‌ను చిరు ఇమేజ్‌కు అనుగుణంగా మంచి మార్పులు చేసిన వినాయక్‌ను ప్రశంసించకపోవడం ఏమిటని? వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదంతో పాటు చిరు, బాలయ్యల అభిమానులు రెచ్చగొట్టే చర్యలకు దిగుతూ, భౌతిక దాడులకు కూడా సిద్దమవుతున్నారు.
ఈ విషయంపై ఓ సినీ విశ్లేషకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజజీవితంలో చిరు, బాలయ్యలు ఎంతో సన్నిహితులని, 'గౌతమీపుత్ర..' ఓపెనింగ్‌కు చిరు రావడమే కాదు.. ఈ ఇరువురు కూడా తమ తమ చిత్రాల విడుదల ముందే మీడియా ముఖంగానే ఒకరికొకరు బెస్టాఫ్‌లక్ చెప్పుకున్నారని గుర్తుచేశాడు. ఇక వీరిద్దరి ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా ఒకరినొకరు వెళ్లి సందడి చేశారని, కాబట్టి చిరు, బాలయ్యలతో కలిసి ఓ ఇంటర్వ్యూని ఒకే వేదికపై చేసి, ఒకరి చిత్రంలోని తమకు నచ్చిన అంశాలను వేరొకరు చెబుతూ, ఒకరినొకరు ఎదుటి వారి చిత్రాలను మెచ్చుకునే ప్రయత్నం చేస్తేనే ఇరువురి వీరాభిమానులు శాంతిస్తారని ఓ పరిష్కారం సూచిస్తున్నాడు. మరి ఇది సాధ్యమయ్యే పనేనా? అని కొందరు నిట్టూరుస్తున్నారు.