'అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రాలతో తనదైన మార్క్‌ను సృష్టించుకుని, వైవిధ్యభరిత చిత్రాల దర్శకునిగా హనురాఘవపూడి పేరు తెచ్చుకున్నారు. కాగా ఆయన తన మూడో చిత్రానికే అక్కినేని అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో ఓ చిత్రం చేసే అవకాశం వచ్చినప్పటికీ 14రీల్స్‌సంస్థలో తన తదుపరి చిత్రం చేస్తానని అగ్రిమెంట్ చేసిన కారణంగా ఆ చిత్రం ప్రస్తుతానికి వాయిదాపడింది. ప్రస్తుతం ఆయన 14రీల్స్‌సంస్థలో నితిన్-మేఘా ఆకాష్‌లు జంటగా ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం మొదటిషెడ్యూల్ పూర్తయి రెండో షెడ్యూల్ ప్రారంభించుకుంది. తన మొదటి రెండు చిత్రాలు బాగా పేరును తెచ్చినప్పటికీ హనుకు స్టార్ డైరెక్టర్ హోదా మాత్రం రాలేదు. సో... ఇప్పుడు నితిన్‌తో చేస్తున్న చిత్రంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు.
'అ...ఆ' ద్వారా 50కోట్ల క్లబ్‌లో చేరిన నితిన్‌కు మరలా ఆ స్థాయి హిట్‌ను ఇస్తే మాత్రం ఇక ఆయనకు అఖిల్ మూడో చిత్రంతో పాటు పలు స్టార్ హీరోల చిత్రాలకు అవకాశం వస్తుందనిచెప్పాలి. అందుకే ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీయలని హను భావిస్తున్నాడు. ఈ చిత్రం ఓ వైవిధ్యభరితమైన కథతో పాటు, హీరో నితిన్ క్యారెక్టర్ కూడా ఎంతో వెరైటీగా, గడ్డం , పాలిష్‌లుక్‌తో పాటు బాడీలాంగ్వేజ్ వరకు అన్ని డిఫరెంట్‌గా ఉంటాయట. ఈ చిత్రంలో నితిన్ హైదరాబాద్ పాతబస్తీ కుర్రాడిగా కనిపించనున్నాడు. మరోవైపు ఎన్నో చిత్రాలలో విలన్ ఆఫర్లు వచ్చినా కూడా ఒప్పుకోని సీనియర్ స్టార్, యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో విలన్‌గా నటించేందుకు ఒప్పుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. తన మొదటి రెండు చిత్రాలకు పేరులేని సంగీత దర్శకులకే అవకాశం ఇచ్చిన హను నితిన్ చిత్రం కోసం మాత్రం సీనియర్ మ్యూజిక్ స్టార్ మణిశర్మను తీసుకున్నాడు.
ఈ చిత్రంలో ఆర్.ఆర్.కి ఎంతో ప్రాధాన్యం ఉండటంతో అందులో సిద్దహస్తుడైన మణికే హను ఓటు వేశాడు. ఈ మధ్య పెద్ద చిత్రాలలో అవకాశాలు సంపాదించుకోలేకపోతున్న మణిశర్మకు ఈ చిత్రం ఎంతో కీలకం కానుంది. మొత్తానికి భారీ బడ్జెట్‌తో మంచి టెక్నీషియన్స్, నటీనటులతో ఈ చిత్రం రూపొందనుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ను కూడా ఎక్కువభాగం అమెరికాలో భారీ ఎత్తున చిత్రీకరించనున్నారు.