ఒక సినిమా విజయం సాధించిందంటే అది సమిష్టి విజయంగానే పరిగణిస్తారు. కేవలం ఒకే ఒక్కరితో సక్సెస్ రాదు. 24 విభాగాల కృషి ఫలితం ఒక సినిమా. అందుకే శాతకర్ణి ఈ విషయాన్ని సమిష్టి విజయం అంటున్నాడు. మాటలు, పాటలు, సంగీతం, ఫైట్స్, ఛాయాగ్రహణం, పాత్రధారులు ఇలా అన్ని విభాగాలకు సినిమా ప్రచారంలో స్థానం కల్పిస్తున్నారు. బాలకృష్ణ కారణంగానే సినిమా ఆడిందని వారు చెప్పడం లేదు. శాతకర్ణి పాత్రని ఆయన అద్భుతంగా పోషించారని అంటున్నారు. పదునైన సంభాషణలు రాసిన బుర్రా సాయిమాధవ్ ప్రతిభను కొనియాడుతున్నారు. శాతకర్ణిలోని మాటలు సామాన్యజనం నిత్యం మాట్లాడుకుంటున్నారు. పత్రికల్లో కూడా ఆ సంభాషణలు వాడుతున్నారంటే అవి ఏ విధంగా పాపులర్ అయ్యాయనే విషయం తెలిసిందే.
ఇక ఖైదీ విషయానికి వస్తే సక్సెస్ క్రెడిట్ మొత్తం చిరంజీవి ఖాతాలో వేసే ప్రయత్నం జరుగుతోంది. కాజల్ ని పక్కన పెట్టేశారని విమర్శలు రావడంతో హడావుడిగా ఆమెను మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఖైదీలో నటించిన ఇతర తారల జాడే లేదు. ఇలా ఏక పక్ష ప్రమోషన్ యూనిట్ సభ్యుల అసంతృప్తికి కారణమవుతోంది. ఒక్కరి వల్ల సినిమా ఆడదనే విషయాన్ని ఖైదీ.. మేకర్స్ గుర్తిస్తే మంచిది. అలాగే దర్శకుడు వినాయక్ కు సైతం సోలో క్రెడిట్ రాకుండా జాగ్రత్తపడ్డారు. టీవీ ఇంటర్య్వూల్లో చిరంజీవి అన్నీ తానే అయ్యి లాగించేశాడు. అయితే త్వరలోనే ఏర్పాటుచేసే వేదికపై సాంకేతిక వర్గాన్ని పరిచయం చేసే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.