మెగా మేనల్లుడుగా ఎంట్రీ ఇచ్చి, గ్రేస్‌తో, ఎనర్జీతో ముఖ్యంగా తన మామయ్యల తరహాలో ప్రత్యేకమైన స్టైల్‌ను, డ్యాన్స్ మూమెంట్స్‌ను, ఫైట్స్‌ను చేస్తూ అతి తక్కువ చిత్రాలతోనే తన స్టామినా చూపించిన మెగాఫ్యామిలీ హీరో.. సాయిధరమ్‌తేజ్. కేవలం మూడునాలుగు చిత్రాలతోనే తన మార్కెట్‌ను 20కోట్లకు పైగా పెంచుకొని, రవితేజ, రామ్ వంటి హీరోలకు ఎసరు పెట్టడం ఖాయమనేలా చేసిన చిచ్చరపిడుగు ఇతనేనని చెప్పవచ్చు. కానీ అలాంటి సమయంలో ఆయన మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా 'తిక్క' చిత్రం చేశాడు. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచే ఇక ఈ చిత్రం ఆడదనే బ్యాడ్ టాక్ అంతటా విస్తరించింది. దీంతో ఈ హీరో చేసిన ఆ చిత్రం తర్వాత ఆయనకు తిక్క కుదిరిందని, ఆచిత్రం నిజంగానే 'తిక్క' పుట్టించే విధంగా ఉందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికి సరిగా ఓపెనింగ్స్ కూడా రాకపోవడం దానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవాలి. దాంతో ఆయన మరోసారి తనను తాను నిరూపించుకోవాల్సిన సంకట స్థితిలోకి పడిపోయాడు.
ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలపు బుజ్జి నిర్మాతగా 'విన్నర్' చిత్రం చేస్తున్నాడు. 'పండగచేస్కో'తో నిరాశపరిచిన గోపీ చాలా గ్యాప్ తీసుకొని ఈ చిత్రం చేస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‌ను చూస్తే ఎవరికైనా ఈ చిత్రం కూడా పూర్తి మాస్, మసాలా అంశాలతో నిండివుండని అర్ధమైపోతుంది. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో హయ్యస్ట్‌బడ్జెట్ ఫిల్మ్‌గా రూపొందుతోంది. హార్స్‌రేస్‌ల నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ కూడా ఎక్కువగా విదేశాల్లో తెరకెక్కుతోంది. మరోపక్క ఇప్పటికే స్టార్‌హీరోయిన్‌గా వెలుగొందుతున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ పెట్టుకున్నారు. ఇక ఆమె చేత 'ధృవ'లోని 'పరేషాన్....' పాటలో కంటే ఎక్కువగానే గ్లామర్‌షో చేయిస్తున్నారు. మరోపక్క ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసి మరీ హాట్ యాంకర్ అనసూయ చేత ఓ సాంగ్ చేయిస్తున్నారు. ఈ పాట కూడా పూర్తిగా మాస్ మసాలాగా యువతకు కిక్కెక్కించే విధంగా రూపొందుతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో మరలా సాయి రేసులోకి వస్తాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది. ఇక ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నక్షత్రం' సినిమాలో ఓ స్పెషల్‌రోల్‌లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. మరి ఈ రెండు చిత్రాలతోనైనా నటునిగా తన ప్రతిభను చూపుతాడో? లేక మరోసారి తిక్కపుట్టిస్తాడో చూడాలి....!