నందమూరి బాలకృష్ణ బోళాశంకరుడే గానీ, అనవసనంగా ఈమధ్య వివాదాలు కొనితెచ్చుకుంటున్నాడు. ఆమధ్య ఫోన్‌లో అభిమానిని బండబూతులు తిట్డాడు. మరో వేడుకలో మహిళలను కించపరిచేలా మాట్లాడాడు. ఇక ఓ సందర్భంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కామెంట్స్ చేశాడు. మరో సందర్భంగా మీడియా ప్రతినిధులను కూడా తీవ్రపదజాలంతో తిట్టాడు. కాగా ప్రస్తుతం ఆయన మరోసారి రెచ్చిపోయాడు. 'గౌతమీపుత్ర..' చిత్రం ప్రీమియర్‌షో సందర్భంగా తన అనుమతి లేకుండా తనకు దగ్గరగా వచ్చి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ అభిమాని చేతిని నెట్టివేయడం, ఐ ఫోన్‌ను విసిరేసే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై యాంటీ నందమూరి ఫ్యాన్స్ బాలయ్యపై విమర్శలు గుప్పిస్తుండగా, బాలయ్య అభిమానులు మాత్రం దానిపై పాజిటివ్‌గా కామెంట్స్ పెడుతున్నారు. మన అభిమాన హీరోలను ముందుగా అడిగి, వారు సమయం ఇచ్చిన తర్వాతే ఫోటోలు దిగడం, సెల్ఫీలు తీసుకోవడం మంచిదని, అలా చేస్తే అభిమానులుగా మనకు, హీరోలుగా వారికి గౌరవం ఉంటుందని బాలయ్య అభిమానులు వాదిస్తున్నారు.
కాగా ఈ సందర్భంగా అక్కడ ఉన్న కొందరు అభిమానులు మాత్రం మరోలా చెబుతున్నారు. ఈ సందర్భం జరగకముందు ఓ అమ్మాయి అడిగితే, కాదనకుండా ఫోజులిచ్చిన బాలయ్య, థియేటర్ బయట ఓ అభిమాని సెల్ఫీ దిగుతుంటే అలా దురుసుగా ప్రవర్తించకూడదంటున్నారు. కాగా బాలయ్య ఆ అభిమాని ఫోన్ విసిరిన తర్వాత కూడా వెళ్తిపోతూ, ఆగ్రహంగా ఆ అభిమానివైపు చూస్తూ 'ఇప్పుడు సెల్ఫీలేంట్రా' అంటూ కోపంగా వెళ్లిపోయాడట. అభిమానుల సందడి మద్యలోకి వస్తే ఇలాంటివి సాధరణమేనని, అదే బాలయ్య జనాలందరూ క్లియర్ అయిన తర్వాత థియేటర్ బయటకు వచ్చి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదు కదా...! అంటున్నారు. ఇక అభిమానులు లేనిదే హీరోలు లేరు. వారు ఏ ప్రతిఫలం ఆశించకుండా కేవలం అభిమానంతోనే ఎంతో ఖర్చు పెడుతారు. కష్టాలు పడతారు. అలాంటి అభిమానుల ప్రవర్తన సరిగా లేకపోయినా సెలబ్రిటీలే కాస్త తగ్గాలి. తమ అభిమానులకు గౌరవం ఇవ్వాలి. ఈ విషయంలో చిరుని ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు. ఆయన ఎవరినైనా విసుక్కుంటాడే గానీ అభిమానుల విషయంలోకి వచ్చినప్పుడు మాత్రం తనకు ఇబ్బంది కలిగినా కూడా ఏమాత్రం మాట జారకుండా, ఆ కోపాన్ని బయటకు చూపకుండా తనలోనే దాచుకొని, వారితో ముచ్చటించి, ఫొటోలకు ఫోజులిస్తారనేది మాత్రం వాస్తవమేనని ఇండస్ట్రీలో అనుభవం ఉన్న ఎవరైనా చెబుతారు.