మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రాన్ని, అందునా దాదాపు పదేళ్ల తర్వాత తాను రీఎంట్రీ ఇచ్చే సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. తన నుండి అభిమానులు ఆశించే డ్యాన్స్‌లు, స్టెప్స్, ఫైట్స్‌తో పాటు అన్ని కమర్షియల్ అంశాలను మేళవిస్తూనే కొద్దిపాటి మెసేజ్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఆయనకు తెలుసు. అందుకే ఎందరో దర్శకులు, రచయితలు చెప్పిన కథలను ఓపిగ్గా విన్నాడు. ఆలస్యమవుతున్నప్పటికీ తనపై ఉన్న భారీ అంచనాల నేపధ్యంలో ఈ చిత్రాన్ని సర్వసిద్దం చేయడం కోసం నెలలు వెచ్చించాడు. చివరకు తమిళ 'కత్తి' రీమేక్‌ను ఆయన ఫ్యాన్స్‌కు, తెలుగు ఆడియన్స్‌కు నచ్చే విధంగా పలు మార్పులు చేర్పులతో వినాయక్‌తో 'ఖైదీ నెంబర్150' చేశాడు. ఈ చిత్రం చూసిన ఫ్యాన్స్ రెస్పాన్స్ అధిరిపోతోంది.
చిరు కాస్త ఆలస్యమైనప్పటికీ మంచి ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చాడని అందరూ భావిస్తున్న సమయంలో అల్లుఅరవింద్ ఓ విషయంలో నోరు జారాడు. ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ కావడానికి కథ, కథాంశాల కన్నా చిరు కంబ్యాక్ ఫిల్మ్ కావడమేనంటూ తేల్చేశారు. ఈ విషయంలో అల్లు మాట్లాడింది చాలా తప్పు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే కథ, కథనం సరిగ్గా లేకపోతే ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్న రోజులివి. 'ఖైదీ' చిత్రానికి కథ, కథనంతో పాటు చిరు కంబ్యాక్ మూవీ అనేది కేవలం ప్లస్ అయిందే గానీ కేవలం కథ, కథనాలు ఎలా ఉన్నా ఫర్వాలేదు.. కేవలం చిరు రీఎంట్రీ సినిమా కావడం వల్లే ఇంతటి విజయం సాధించిందని చెప్పి అల్లు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం చాలా మంది తప్పుపడుతున్నారు. మరి దీనికి అల్లు వారు మరలా తన ప్రతిస్పందనను ఎలా తెలుపుతారు? నా మాటలను మీడియా వక్రీకరించిందని చెబుతారేమోనని వేచిచూస్తున్నారు.