'ఖైదీ నంబర్ 150' సినిమా భారీ ఓపనింగ్స్ ఊహించిందే. ముందస్తు ప్రణాళిక ఫలించింది. ఎక్కువ థియేటర్ల ఎంపిక, ఎక్కువ షోల ప్రదర్శన వల్ల ఆశించిన మేర కలక్షన్లు వచ్చాయి. ఖైదీ...కి అభిమానులు భారీ స్వాగతం పలికారనేది వాస్తవం. చిరంజీవి పునరాగమనాన్ని వారు ఆహ్వానించారా ? లేక తొమ్మిదేళ్ళ తర్వాత చిరు ఎలా ఉంటాడనే ఆసక్తితో సినిమా చూశారా? అనేది మరికొద్ది రోజుల్లో తేలుతుంది. అభిమానగణం మెండుగా ఉన్న మెగాస్టార్ కు ఇలాంటి ఘన స్వాగతం గతంలో కూడా లభించింది. 'ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తాను' అంటూ చిరంజీవి ప్రకటించాక విడుదలైన సినిమా 'ఇంద్ర' (2002). చిరంజీవి రాకను స్వాగతిస్తూ 'ఇంద్ర'కు భారీ ఓపనింగ్స్ ఇవ్వడం వల్ల అభిమానులు తమ సమ్మతిని తెలిపారని భావించారు. ఇది చిరు రాజకీయ ప్రవేశానికి మార్గం సుగమం చేసింది. తీరా పార్టీ పెట్టి జనంలోకి వెళితే మాత్రం ప్రతికూల ఫలితం వచ్చింది. సాక్షాత్తు చిరంజీవినే సొంతగడ్డపై ఓడించారు. రాజకీయంగా పరాభవాన్ని మిగిల్చారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరని స్పష్టం చేశారు. తిరుపతి శాసనసభ నియోజక వర్గానికి రాజీనామా చేశాక జరిగిన ఉపఎన్నికల్లో సైతం చిరంజీవి నిలబెట్టిన అభ్యర్థి గెలవలేదనే విషయం తెలిసిందే.
అందుకే ఖైదీ.. సినిమా కలక్షన్లు ఆయన రాజకీయ మనుగడకు ఉపయోగపడవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒక రీమేక్ కథతో అది కూడా సందేశం పేరుతో కమర్షియల్ అంశాలు జోడించి తీస్తే ప్రజలు పట్టించుకుంటారా. సినిమాల ద్వారా రైతు సమస్యలు పరిష్కారం అవుతాయా?. తను రాజకీయాల్లో ఉంటూ రైతుల తరుపున పోరాడి, వారి సమస్యలు పరిష్కరించే మార్గాలు వెతక్కుండా సినిమా ద్వారా పరిష్కరిస్తానంటే కుదురుతుందా? కార్పోరేట్ హాస్పటల్స్ అవినీతి పై సంధించిన 'ఠాగూర్' సినిమా ద్వారా సందేశం ఇస్తే మార్పు వచ్చిందా? ఈ విషయాలు ప్రజలకు తెలియవా?.