తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. కాగా ఆయనకు గత కొంతకాలంగా పెద్దహిట్స్‌లేవు. దాంతో త్వరలో ఆయన తనకు మంచి బ్రేక్స్ ఇచ్చిన మాస్ అండ్ పోలీస్ చిత్రాల స్పెషలిస్ట్ హరి దర్శకత్వంలో 'ఎస్3' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం పలుసార్లు వాయిదాపడి, వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఈ చిత్రాన్ని ఈనెల 26న రిపబ్లిక్‌డే కానుకగా విడుదల చేయాడానికి రెడీ అవుతున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్‌కు కూడా వెళ్లింది.కాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తమిళంలో నిర్మించే చిత్రాలలో ఆ భాషల్లోనే పెట్టే టైటిల్స్ ఉన్న చిత్రాలకు, అలాగే క్లీన్‌యు సర్టిఫికేట్‌తో రిలీజ్ అయ్యే చిత్రాలకు పలు రాయితీలు కల్పిస్తుంది.
దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు పలు చిత్రాల మేకర్స్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. గతంలో సూర్య హీరోగా వచ్చిన 'సికిందర్' తమిళ వెర్షన్‌కు యు/ఎ సర్టిఫికేట్ ఇవ్వగా, ఈ చిత్రం సెన్సార్ కోసం నిర్మాతలు ముంబై రివైజింగ్ కమిటీకి వెళ్లి, సెన్సార్ సభ్యులను పలు విధాలుగా ప్రలోభ పెట్టి క్లీన్ యు సర్టిఫికేట్ తెచ్చుకోవడం, దీనిని ఓ సెన్సార్ మెంబర్ బయటపెట్టడంతో తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా సూర్య చేస్తున్న 'ఎస్3' చిత్రంలో కూడా పలు బూతు డైలాగ్‌లు, హింసాత్మక సన్నివేశాలు, హీరోయిన్స్ అనుష్క, మరీ ముఖ్యంగా శృతిహాసన్ నటించిన కాస్ట్యూమ్స్ చాలా ఇబ్బందిగా ఉండటంతో తమిళనాడు సెన్సార్‌బోర్డ్ ఈ చిత్రానికి కూడా యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది.దాంతో ఈ చిత్రంలోని పలు డైలాగ్స్‌ను, హింసాత్మక దృశ్యాలకు కత్తెర వేసి, మరోసారి క్లీన్ యు సర్టిఫికేట్ కోసం సెన్సార్‌కు పంపారని కొందరు అంటుంటే, ఈ చిత్రాన్ని మరలా యథాతథంగా సెన్సార్‌కు పంపి మరోసారి సెన్సార్‌బోర్డ్ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారనే వార్తలు కోలీవుడ్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.