‘ఖైదీ నెంబర్ 150’ ప్రమోషన్ వేడుక కార్యక్రమం అత్యంత రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. అయితే ఆ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రసంగం ఆసక్తికరంగా సాగి అభిమానుల్ని అలరించినప్పటికీ, వేడుక అయ్యాక అందరి దృష్టి మాత్రం నాగబాబు ప్రసంగంపైనే పడింది. ఆ వేడుకలో...రామ్ గోపాల్ వర్మ, యండమూరి వీరేంద్రనాథ్ లపై నాగబాబు తీవ్రంగా విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెంటనే రామ్ గోపాల్ వర్మ, నాగబాబుకు దిమ్మతిరిగేలా రివర్స్ అటాక్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. కాగా ఈ గొడవకు సంబంధించి రెండు రోజులుగా చర్చోపచర్చలు అటు విమర్శకుల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ సాగుతున్నాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై స్పందించాడు. ఈ విషయంలో చిరంజీవి చాలా చాకచక్యంగా మాట్లాడి తన అభిప్రాయాన్ని ప్రకటించే ప్రయత్నం చేశాడు అనేకంటే.. తప్పించుకునే ప్రయత్నమే చేశాడు అనడం సమంజసంగా ఉంటుందేమో.
కాగా చిరంజీవి మాట్లాడుతూ... రామ్ గోపాల్ వర్మ తన గురించిగానీ, తన సినిమాలపై గానీ చేసిన వ్యాఖ్యలు గురించి తానేమీ పట్టించుకోనని తెలిపాడు. అయితే నాగబాబు ఆయన వ్యాఖ్యలకు కొంత నొచ్చుకొని అలా స్పందించి ఉండవచ్చని ఆయన అన్నాడు. అంతే గాని తాను నాగబాబు, వర్మపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేది ఏం లేదని ఆయన వివరించాడు. అయితే .. సినిమా పరిశ్రమలో తనకు రామ్ గోపాల్ వర్మతో ఎలాంటి సమస్యలేదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ తనకు మంచి స్నేహితుడని కూడా తెలిపాడు. ఇంకా చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఖైదీ నెంబర్ 150’ వేడుక కార్యక్రమానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాకపోవడంపై కూడా చిరు స్పందించాడు. పవన్ ను రామ్ చరణ్ వ్యక్తిగతంగా కలిసి మరీ ఆహ్వానించాడని, అయితే పనులు ఉండటం మూలంగానే తాను రాలేకపోతున్నానని పవన్ వెల్లడించాడని చెప్పాడు. అంతేకాకుండా పవన్ తమ సినిమాకు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేసిన వైనాన్ని కూడా చిరు గుర్తు చేసుకున్నాడు. ఇంకా ఇంట్లో అందరూ కూడా ప్రతి కార్యక్రమానికి రావాలన్న రూలేం లేదని చిరంజీవి తెలిపాడు.