మాటల మాంత్రికునిగా, దర్శకునిగా కూడా తన సత్తా చాటిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయనకు ఇటీవల వరకు కేవలం క్రేజ్ ఉన్న స్టార్స్‌తోనే సినిమాలు చేసి, వారి ఇమేజ్‌ను క్యాష్ చేసుకుంటూ విజయాలు సాధిస్తాడనే విమర్శ ఉంది. కానీ ఆయన మొదటి చిత్రం తరుణ్‌తో తీసి సక్సెస్ ఆయ్యాడు. ఇక తాజాగా నితిన్ వంటి యంగ్‌హీరోతో, సమంత కీలకపాత్రలో నటించిన ఛిత్రం 'అ..ఆ' ద్వారా ఆ విమర్శలకు చెక్‌పెట్టాడు. ఈ చిత్రం ఏకంగా 50 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆయన తాజాగా వరుస స్టార్స్ సినిమాలు చేయడానికి రెడీ అయిపోయాడు. త్వరలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో ఓ చిత్రం చేయనున్నాడు.
ఇది వారిద్దరి కాంబినేషన్‌లో 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీగా రూపొందనుంది. ఆ తర్వాత ఆయన తొలిసారిగా ఎప్పటినుంచో తనతో చిత్రం చేయాలని ముచ్చటపడుతున్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఆ తర్వాత ఆయన సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో కూడా మూడో చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. ఆయన ఇప్పటివరకు మహేష్‌తో 'అతడు, ఖలేజా' చిత్రాలు చేశాడు. 'అతడు' చిత్రం కలెక్షన్లపరంగా చూసుకుంటే జస్ట్ ఓకే అనిపించింది. ఇక 'ఖలేజా' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
దాంతో ఈ మూడో చిత్రం ద్వారా తాను మహేష్‌కు బాకీపడిన బ్లాక్‌బస్టర్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు.మరో వంక మరో రచయితగా ఉండి దర్శకుడిగా మారిన కొరటాల శివ తన మొదటి చిత్రం 'మిర్చి'తో ప్రభాస్‌కు పెద్ద హిట్ ఇచ్చాడు. మహేష్‌తో ఆయన చేసిన 'శ్రీమంతుడు' చిత్రం రికార్డులను తిరగరాసింది. ఇక ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన 'జనతా గ్యారేజ్' యంగ్‌టైగర్ కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా ఈ దర్శకుడు కూడా తన తర్వాతి మూడు చిత్రాలను స్టార్స్‌తోనే చేయనున్నాడు. డివివి దానయ్య నిర్మాతగా ఆయన మహేష్‌తో రెండో సారి చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత రామ్‌చరణ్‌ను దర్శకత్వం వహించే చిత్రం ప్రారంభంకానుంది. ఇక తన మూడో చిత్రంగా మరోసారి యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తోనే రెండో చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడు. మొత్తానికి ప్రస్తుతం త్రివిక్రమ్, కొరటాల శివలు మరో రెండేళ్లపాటు స్టార్స్ చిత్రాలతో బిజీ బిజీగా మారనుండటం వారికి నేడు టాలీవుడ్‌లో ఉన్న డిమాండ్‌కు అడ్డంపడుతోందని అంటున్నారు.