జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ప్రతి కదలికను పనిగట్టుకొని మరీ పసి పడుతుంది ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ. లేకపోతే మొన్న అక్వాఫుడు పార్క్ వల్ల నష్టం కలుగుతుందని, అది వేరే చోటకి తరలించాలని బాధితులు పవన్ ని కోరడంతో దానిపై పవన్ స్పందించగా వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ ప్రాజెక్టుపై పవన్ కు స్పష్టత ఇచ్చింది. మళ్ళీ నిన్న శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారి గోడును పవన్ పట్టించుకోవడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై స్పందన వచ్చి తగు దిశగా చర్యలు చేపట్టేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని రూపొందిస్తుంది.
అయితే ఇన్నాళ్ళు ఈ సమస్య జటిలంగా మారిందని ప్రభుత్వానికి తెలియదా? అంటే తెలుసు.. కానీ పట్టించుకున్న పాపాన ఏరోజు ప్రభుత్వం పోలేదు. కాగా నేడు పవన్ ఆయా విషయాలపై గొంతు పెంచడంతో ప్రభుత్వానికి ఒక కదలిక వచ్చిందనే చెప్పాలి. అసలు విషయం చెప్పాలంటే... కిడ్నీ సమస్యపై ఆ ప్రాంత ప్రజలు ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పడుతున్న విషయం జగమెరిగిన సత్యం. అది స్థానికంగా ఉన్న తెదేపా నేతలకు కూడా బాగా తెలుసు. కానీ వారి గోడును ఏనాడూ వినిపించుకున్న పాపాన పోలేదనే చెప్పాలి.
సహజంగా ఇటువంటి వాటిపై పోరాటాలన్నీ ప్రతిపక్ష పార్టీ చేయాల్సింది. కానీ అనుకోకుండా రాజకీయంగా బలపడాలన్న ఉద్దేశంతో ఏయే ప్రాంతంలో ప్రజా సమస్యలు ఉన్నాయో వాటిని వెలుగులోకి తెచ్చేందుకు వాటిపై ప్రధానంగా పోరాడేందుకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నాడు. అందుకు ముందుగా పవన్ ను అభినందించాల్సిందే. కానీ అసలు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పోరాటాలను చంద్రబాబు చాలా నిశితంగా పరిశీలిస్తున్నాడనే చెప్పాలి. అయితే ఎక్కడో ప్రశ్నలాంటి ఆలోచన ప్రతి ఆంధ్రుడుని తొలిచి వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ నేత అయిన జగన్ ఎన్ని రకాలుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసినా పట్టించుకోని చంద్రబాబు, పవన్ చేస్తున్న పోరాటానికి వెంటనే ఆగమేఘాలపై స్పందిస్తున్నాడంటే ఇందుకు కారణం పవన్ కళ్యాణ్ ను చూసి చంద్రబాబు భయపడుతున్నాడా? అన్న సందేహం కలుగుతుంది.
విచిత్రంగా జగన్ ఎటువంటి పోరాటానికి ఒడిగట్టినా అది రాజకీయం చేస్తున్నాడు, ప్రభుత్వం చేస్తున్న పనులకు అడ్డుపడుతున్నాడంటూ చెప్పుకొచ్చే అధికార పార్టీ అదే పని పవన్ చేస్తే వాటిపై వెంటనే చర్యలు తీసుకుంటూ ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే దీని అర్థం పవన్ ను చూసి బాబు చాలా తీవ్రంగా భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. అందుకు నిదర్శనం ఎన్నోయేళ్లుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెదేపాకు తెలియదా? ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఈ విషయం లేవతీయగానే ప్రభుత్వానికి గుర్తు వచ్చిందా? దీన్ని బట్టి చంద్రబాబు పవన్ ను చూసి భయపడుతున్నట్లుగానే తెలుస్తుంది.