నిన్నరాత్రి హాయ్ ల్యాండ్ లో జరిగిన 'ఖైదీ నెంబర్ 150 ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. నాగబాబు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి బాగా ఘాటైన వ్యాఖ్యలతో తిట్ల పురాణం ఇప్పుడు రసాభాసాగా మారింది. నాగబాబు ఎవరునుద్దేశించి తిట్టాడో... ఆ ఇద్దరూ నాగబాబు వ్యాఖ్యలకు స్పందించారు. అందులో ఒకరు ప్రముఖ రచయిత యండమూరి కాగా రెండో వ్యక్తి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇక యండమూరి మాత్రం నేను రామ్ చరణ్ ని అన్న వ్యాఖ్యలును నాగబాబు తప్పుగా అర్ధం చేసుకుని ఏదో ఆవేశంలో అలా మాట్లాడాడని... ఆయనతో నేను భవిష్యత్తులో పనిచేసే అవకాశం ఉంటుందని తనదైన శైలిలో స్పందించాడు.
ఇక రామ్ గోపాల్ వర్మ మాత్రం 'ఖైదీ.. ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగేటప్పుడే నాగబాబు చేసిన వ్యాఖ్యలకు కొంచెం భయపడి వెంటనే మెగా ఫ్యామిలీకి, చిరంజీవికి క్షమాపణ చెప్పేసాడు. ఇంకేముంది వర్మ తన తప్పు తెల్సుకుని క్షమించమన్నాడుగా గొడవ సద్దుమణిగింది అని అనుకుంటున్న టైమ్ లో వర్మ మళ్ళా ట్వీట్స్ మొదలు పెట్టాడు. తన ఎకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని వ్యంగ్యంగా మొదలు పెట్టిన వర్మ, నాగబాబు కి అన్నని కాకా పట్టడంతోనే టైమ్ సరిపోతుందని.... అంతకుమించి నాగబాబుకి వేరే పని లేదని... నాగబాబుకు ఇంగ్లీష్ రాదనీ.... అసలు నీ కెరీర్ ఎలా ఉందో ఓసారి చూసుకోమని ఘాటైన ట్వీట్స్ తో నాగబాబుకు కౌంటర్లు ఇచ్చాడు. అలాగే మీ అన్న చిరంజీవి గురించి నీకు 0 .1 మాత్రమే తెలుసనీ... నీవు జబర్దస్త్ ని నమ్ముకుని అన్నయ్య మీద బతుకుతున్నావని అన్నాడు. అంతటితో ఆగకుండా నాగబాబు, చిరంజీవిని చాలాసార్లు తప్పుదోవ పట్టించాడని ...... అసలు ప్రజారాజ్యం పార్టీ బ్రష్టు పట్టడానికి కారణం నాగబాబే నని.... అసలు ఇలాంటి ఫంక్షన్స్ కి నాగబాబును పిలవొద్దని... ఒకవేళ పిలిస్తే ఇదిగో ఇలాగే ఫంక్షన్ ని చెడగొడతాడని చిరును కోరుతూ వర్మ వరుసగా ట్వీట్స్ చేసాడు.
ఇంకా వరుణ్ ని ఉద్దేశించి కూడా వర్మ ట్వీట్స్ చేసాడు. మీ నాన్న మాటలు వింటే నువ్వు పైకి రాలేవని.... ఇంకా చిరుగారి భజనతోనే నువ్వు బతకాల్సి వస్తుందని.... నీ నిర్ణయం నువ్వు సొంతంగా తీసుకోమని... అబ్బో ఒకటేమిటి చాలా సలహాలే ఇచ్చాడు. మరి ఈ వర్మ ట్వీట్స్ కి ఇప్పటిదాకా మెగా కాంపౌండ్ నుండి ఒక్క కౌంటర్ కూడా పడలేదు.