చిరంజీవి హీరోగా ఎదుగుతున్న రోజుల్లో ఆయనకు 'సుప్రీం హీరో' అనే బిరుదు ఉండేది. ఆ తర్వాత ఆయన నెంబర్‌వన్‌గా టాలీవుడ్‌ని ఏలుతున్నప్పుడు 'మెగాస్టార్'గా ఆయన బిరుదు మారింది. ఆ తర్వాత 'బిగ్‌బాస్' సమయంలో ఆయన పేరుకు ముందు 'మెచో మెగాస్టార్' అని తగిలించారు. కానీ అది పెద్దగా పాపులర్ కాలేదు. ఇక నాగార్జున విషయానికి వస్తే ఆయనను మొదట్లో అందరూ 'నటసమ్రాట్ ఏయన్నార్' వారసుడు కావడంతో ముద్దుగా 'యువసమ్రాట్' అని పిలిచేవారు. కానీ వయసు పెరిగింది కాబట్టి 'కింగ్' సినిమా తర్వాత ఇక ఈ వయసులో తనను ఇంకా 'యువసమ్రాట్'గా పిలువవద్దని 'కింగ్'గా పిలవాలని ఆయన తన అభిమానులను స్వయంగా కోరాడు.
తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా తన బిరుదును మార్చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆయనను కెరీర్ మొదట్లో ఆయన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ 'నటరత్న' కావడంతో బాలయ్యకు 'యువరత్న' అనే బిరుదును ఆయన అభిమానులు పెట్టుకున్నారు. ఆ తర్వాత మంచిఫామ్‌లో ఉండి, చిరుకు పోటీగా నిలబడుతున్న సమయంలో ఆయనను అభిమానులు 'నందమూరి నటసింహం'అంటూ పిలుచుకున్నారు. తాజాగా బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో తన బిరుదును మార్చుకున్నాడు. ఇకపై తనను 'బసవ తారకరామ పుత్ర బాలకృష్ణ' పిలవాలని తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. దాంతో విడుదలకు సిద్దమవుతున్న ఆయన 100వ చిత్రం 'గౌతమీపుత్ర...' టైటిల్ కార్డ్స్‌లో కూడా 'బసవ తారకరామ పుత్ర బాలకృష్ణ' అనే కొత్త బిరుదునే వేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ బిరుదు ద్వారా ఆయన తన తల్లిదండ్రులపై ఉన్న అభిమానాన్ని, ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నాడని నందమూరి అభిమానులు ఆనందపడుతున్నారు. తాజాగా బాలయ్య అభిమానులు 'గౌతమీపుత్ర....' చిత్రాన్ని ఈనెల 12న కాకుండా చిరు 'ఖైదీ...' చిత్రానికి పోటీగా 11వ తేదీనే విడుదల చేయాలంటూ దర్శకుడు క్రిష్ ఆఫీసు ముందు ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది.