తన కెరీర్ ప్రారంభంలో 'ఆనందం, సొంతం' వంటి లవ్ సబ్జెక్ట్స్‌ను డీల్ చేశాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఆ తర్వాత ఆయన 'బకరా' ఫార్ములాను నమ్ముకొని 'ఢీ' చిత్రం చేశాడు. విడుదలలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న ఈ చిత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొంది, ఆ తరహా చిత్రాలకు నాంది పలికింది. దీనితో పలువురు దర్శకులు కూడా శ్రీనువైట్ల దారిలోనే నడిచారు. ఇలా ఓ కొత్త ఒరవడికి ప్రాణం పోసిన శ్రీనువైట్ల అదే ఫార్ములాని నమ్ముకుంటూ వరుస చిత్రాలు చేసి విజయం సాధించడంతో ఆయన టాలీవుడ్‌లోని టాప్ 5 దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. దీంతో స్టార్‌హీరోలతో పాటు పలువురు నిర్మాతలు ఆయనతో చిత్రాలు తీసేందుకు క్యూ కట్టారు. ఆ సమయంలో ఆయన భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి, బాగానే వెనకేశాడు. కానీ ఈ ఫార్ములా రాను రాను ప్రేక్షకులకు బోర్ కొట్టింది. దీంతో పాటు ఆయన మహేష్‌తో తీసిన 'ఆగడు', రామ్‌చరణ్‌తో తీసిన 'బ్రూస్‌లీ' చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలవడంతో ఆయనతో చిత్రాలు చేయడానికి మీడియం రేంజ్ హీరోలు కూడా ముందుకురాలేదు. అలాంటి సమయంలో మెగాహీరో వరుణ్‌తేజ్‌ను పెట్టుకొని ప్రేమకథా చిత్రంగా 'మిస్టర్' చిత్రం చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచిస్పందనే లభిస్తోంది. ఈ చిత్రాన్ని తాను అనుకున్న విధంగా తీయడానికి నిర్మాతలైన బుజ్జి,మధుల చేత 30కోట్ల దాకా ఖర్చుపెట్టిస్తున్నాడని, విదేశాలలోని పలు అద్భుతమైన లోకేషన్లలో తీయడం కోసం అంతలా ఖర్చు పెట్టిస్తున్నాడని సమాచారం.
వరుణ్‌తేజ్ మార్కెట్‌కు 30కోట్లు అంటే చాలా ఎక్కువే అని చెప్పాలి. కాగా ఇంత బడ్జెట్‌ను పెట్టిస్తున్నందుకు తనవంతు సాయంగా ఈ చిత్రానికి ఆయన ఫ్రీగా పని చేస్తున్నాడట. పదిపైసలు కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా విడుదలై లాభాలు వస్తేనే ఇవ్వండని చెప్పాడని సమాచారం. ఇక తాజాగా ఈ చిత్రం ట్రైలర్ చూసి బాగుందని ఫీలయిన నాగ్ తనయుడు నాగచైతన్య తాను శ్రీనువైట్లతో చిత్రం చేయడానికి అంగీకరించాడని సమాచారం. ఈ చిత్రాన్ని నాగ్ ప్రాణస్నేహితుడు, ఆయనతో ఎన్నో చిత్రాలు నిర్మించిన శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నాడు. కాగా కెరీర్ ప్రారంభంలో యువ సామ్రాట్‌గా పేరు తెచ్చుకొని, 'మన్మథుడు'తో అదే టైటిల్‌తో ఫేమస్ అయిన నాగ్‌ను ప్రస్తుతం ఆయన అభిమానులు 'కింగ్' అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ 'కింగ్'కు దర్శకత్వం వహించింది కూడా శ్రీనువైట్లనే కావడం విశేషం. మరి ప్రస్తుతం యువ సామ్రాట్‌గా పిలువబడుతున్న చైతూని తన చిత్రంతో ఎలాంటి టైటిల్ పెట్టి, ఏ బిరుదును ప్రసాదిస్తాడో వేచిచూడాల్సివుంది....!