నారా రోహిత్ ఎంతో ఇష్టపడి, కష్టపడి తానే నిర్మించి, నటించిన 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న సంగతి తెలిసిందే. క్రమంగా కలెక్షన్లు పుంజుకుంటున్న ఈ చిత్రం 20కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. దీంతో ఐటి శాఖ కన్ను ఈ చిత్రంపై పడింది. తాజాగా ఐటి అధికారులు ఈ చిత్ర హీరో, నిర్మాత అయిన నారా రోహిత్ ఇంటిపై, ఆయన సంస్థ అయిన ఆరన్ మీడియా ఆఫీసు, ప్రశాంత్ ముళ్లపూడి ఇళ్లపై దాడి చేశారు. ప్రతి చోటా అన్ని రికార్డులను పరిశీలించిన అధికారులు ఎలాంటి అనధికారిక ఆస్తులు, డబ్బులు లేవని, రికార్డులన్నీ సవ్యంగా ఉన్నాయని భావించి వెనుదిరిగారు. కాగా ఈ చిత్రం గురించి నారా రోహిత్ మాట్లాడుతూ, తాను నటించి, నిర్మించిన చిత్రంకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఎంతో ఆనందంగా ఉందన్నాడు. పాత్ర నచ్చితే లెంగ్త్ గురించి ఆలోచించని, సినిమా బాగుంటే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని తెలిపాడు. కాగా గతంలో తాను ఒకేసారి అనేక చిత్రాలు ఒప్పుకుంటూ, ఎక్కువ చిత్రాలు చేయడం....అవి వెంట వెంటనే విడుదల కావడం వల్ల ఏది ఏ సినిమానో తేల్చుకోలేక ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అయ్యారని, ఈ విషయాన్ని తాను గ్రహించానని, ఇకపై అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చాడు. మొత్తానికి తన తప్పు త్వరగానే రోహిత్ తెలుసుకోవడం ఆయన భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.