క్రిష్ ప్రోత్సాహంతో 'కృష్ణం వందే జగద్గురుం; కంచె' చిత్రాలకు అద్భుతమైన, ఆలోచనాత్మక సంభాషణలు రాసి, ఎమోషనల్ డైలాగ్స్ రాయడంలో మంచి పేరు తెచ్చుకున్న రచయిత సాయిమాధవ్ బుర్రా. ఆ తర్వాత ఆయన పవన్‌కళ్యాణ్ దృష్టిని ఆకర్షించాడు. దాంతో ఆయన జాతకం ఒక్కసారిగా మారిపోయింది. పవన్, వెంకటేష్‌లు నటించిన 'గోపాలా. గోపాలా...' చిత్రానికి సందర్భోచిత సంభాషణలతో మెప్పించి, మరోసారి పవన్-డాలీల దర్శకత్వంలో రూపొందుతున్న 'కాటమరాయుడు'కు కూడా సంభాషణల విభాగంలో పనిచేస్తున్నాడు. తాజాగా ఆయన సీనియర్ స్టార్స్ అయిన చిరు, బాలయ్యల ప్రతిష్టాత్మక చిత్రాలకు సంభాషణలు రాశాడు. క్రిష్‌కు ఆస్దాన రచయిత అయిన సాయిమాధవ్ 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలో బాలయ్యకు, ఇతర పాత్రధారులకు రాసిన పవర్‌ఫుల్ సంభాషణలు ట్రైలర్‌లోనే అద్భుతంగా ఉన్నాయి. అదే సమయంలో ఆయన చిరు నటిస్తున్న 150వ చిత్రమైన 'ఖైదీ నెంబర్ 150'కి కూడా సహాయ సంభాషణలు, మరీ ముఖ్యంగా ఎమోషనల్ డైలాగులు రాశాడట. ఈ చిత్రం ప్రీక్లైమాక్స్‌లో వచ్చే రైతుల సమస్యలపై ఆయన రాసిన లెంగ్తీ డైలాగ్స్, వాటిని చిరు పలికిన తీరు చిత్రానికి మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని సెన్సార్ సభ్యుల పొగడ్తలు కూడా అందుకున్నాడనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఆయన అశ్వనీదత్ కుమార్తె స్వప్న 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేమ్, అశ్వనీదత్ అల్లుడు నాగ్ అశ్విన్‌లు ఎంతో రీసెర్చి చేసి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించనున్న 'మహానటి' చిత్రానికి కూడా రచయితగా పనిచేస్తున్నాడు. అలాగే దర్శకురాలిగా ఇప్పటికే మంచి గుర్తింపును తెచ్చుకున్న సూపర్‌స్టార్ కృష్ణ కూతురు, మహేష్‌బాబు సోదరి మంజుల చాలా గ్యాప్ తర్వాత సందీప్‌కిషన్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రానికి కూడా పనిచేయనున్నాడు. జంధ్యాల, సత్యానంద్ మరీ ముఖ్యంగా పరుచూరి బ్రదర్స్ వంటి వారి స్థానంలో సాయిమాధవ్ బుర్రా ఎదుగుతున్న తీరును చూస్తే ఆనందం వేయకమానదు. మరోపక్క ఈ సంక్రాంతికి సీనియర్‌స్టార్స్ అయిన చిరు, బాలయ్యలు పోటీపడటంపై నాగబాబుతో పాటు రామ్‌చరణ్ కూడా సంతోషం వ్యక్తం చేసి ఇద్దరికీ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పిన నేపథ్యంలో సాయి మాధవ్ బుర్రా కూడా అదే మాటలను చెప్పాడు. ఇద్దరు పెద్దహీరోలు పోటీపడుతున్న నేపథ్యంలో వార్ ఈజ్ వన్‌సైడ్ వంటి కామెంట్లు తగవని ఇన్‌డైరెక్ట్‌గా వర్మకు కౌంటర్ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలు విజయవంతం కావాలని కోరుకున్నాడు.