వర్మ ఏదైనా పీక్స్‌లోనే చేస్తాడు. ఆయన చెప్పే కొన్ని నిజాలను మన మనసులు అంగీకరించకపోవచ్చు గానీ వాటిల్లో వాస్తవాలు కూడా ఉంటాయని అందరూ ఒప్పుకుంటారు. అందుకే వర్మను బండబూతులు తిట్టేవారు కూడా ఆయన ట్వీట్స్‌పై, వ్యాఖ్యలపై ఓ కన్నేసి ఉంచుతారు. కేవలం ఈ రోజుల్లో రెండున్నర లక్షల్లో ఓ ఫీచర్‌ఫిల్మ్‌ను 'ఐస్‌క్రీమ్' పేరుతో తీసి కొత్త సంచలనాలకు నాంది పలికిన వర్మ ఎప్పుడూ.. తాను తీసే చిత్రాల బడ్జెట్ విషయంలో మాత్రం పరిమితుల్లోనే ఉంటాడు. ప్రస్తుతం ఆయన అమితాబ్‌తో 'సర్కార్3' చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ను తనతో 'వంగవీటి' చిత్రాన్ని తీసిన దాసరి కిరణ్‌కుమార్ కేే ఇచ్చాడు. కాగా త్వరలో ఆయన ఇండియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ఓ ఆంగ్లచిత్రంగా 'న్యూక్లియర్'ను తీయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సీయంఎ గ్లోబల్‌సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం షూటింగ్‌ను ఇండియాతో పాటు చైనా, జపాన్, అమెరికా, రష్యా, బ్రిటన్, ఇండోనేషియా, యెమెన్ వంటి దేశాల్లో తీయనున్నట్లు ఆయన ప్రకటించిన తర్వాత ఇదో పబ్లిసిటీ స్టంట్‌గా కొందరు భావించారు. ఎందుకంటే వర్మకు ఇలాంటి సంచలన స్టేట్‌మెంట్స్ ఇవ్వడం మామూలే. తాజాగా ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలను వర్మ చెప్పాడు.
ఈ చిత్రంలో వివిధ దేశాలకు చెందిన నటీనటులు నటించనున్నారట. 'న్యూక్లియర్ టెర్రరిజం' నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. రెండో ప్రపంచ యుద్దంలో అమెరికా వేసిన అణుబాంబుల వల్ల జపాన్ ఎంతగానో నష్టపోయింది. హీరోషిమా, నాగసాకి వంటి ప్రదేశాలల్లో ఇప్పటికీ గడ్డి కూడా మొలవని పరిస్థితులు ఉన్నాయి. కాగా ముంబై వంటి మహానగరంపై ఇలాంటి అణుదాడి జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి? అనేది ఈ చిత్ర కథాంశం. ప్రస్తుతం ఉగ్రవాదం వల్ల అన్ని దేశాలు వణికిపోతున్నాయి. విమానాలతో టవర్లను కూల్చేయడం, ట్రక్కులతో జనావాసాలపై పడి చంపేయడం నిత్యకృత్యమైపోయింది. అదే న్యూక్లియర్ బాంబులు టెర్రరిస్ట్‌ల చేతికి అంది, వాటిని పాకిస్తాన్ టెర్రరిస్ట్‌లు ముంబైపై వేయాలని నిర్ణయించడం, ఆ బాంబులను నిర్వీర్యం చేయడం కోసం అమెరికా భారత్, పాకిస్తాన్‌లను హెచ్చరించి, దానిని ఆపే ప్రయత్నం చేయడం వంటి కథాంశంతో ఈచిత్రం రూపొందనుందని వర్మ తెలుపుతున్నాడు. 'బాహుబలి' తాజాగా '2.0' చిత్రాలను ఇండియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో దానిని మించిన బడ్జెట్‌తో ఈ చిత్రం తీయనున్నాడట వర్మ. కాలేజీ గొడవలు, చైన్లతో కాలేజీ కుర్రాళ్లు కొట్టుకునే 'శివ' చిత్రంతో మొదలైన తన కెరీర్ ప్రస్తుతం దేశాల మధ్య గొడవల నేపథ్యంలో న్యూక్లియర్ బాంబుల వరకు వెళ్లడం తనకు ఎంతో గర్వంగా ఉందని వర్మ చెబుతున్నాడు. ఈ చిత్రం మేలో మొదలై మూడేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుంటుందని వర్మ పేర్కొన్నాడు. మరి చూద్దాం.... ఈసారైనా వర్మ ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ దాకా తీసుకెళ్లతాడో? లేదో?