టాలీవుడ్ సీనియర్ స్టార్స్ అయిన నందమూరి బాలకృష్ణ, మెగా స్టార్ చిరంజీవి ఇద్దరూ ఈ సంక్రాతికి నువ్వా - నేనా అని పోటీ పడుతున్నారు. అటు చిరుకి 150 వ చిత్రం ల్యాండ్ మార్క్ మూవీ కావడం ఇటు బాలయ్యకి 100వ చిత్రం కావడంతో వారు నటించిన 'ఖైదీ నెంబర్ 150 , గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలపై భారీ అంచనాలు నెలకొని వున్నాయి. అయితే వీరు తమ సినిమాలను సంక్రాంతికే విడుదల చేస్తామని సినిమాలు మొదలైనప్పుడే ప్రకటించారు. ఇక వారి మద్యలోకి ఈ మధ్యనే హిట్ ట్రాక్ ఎక్కిన శర్వానంద్ 'శతమానం భవతి' చిత్రంతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు.
ఇద్దరు బడా హీరోల మధ్యన పిల్ల కాకిలా కనిపిస్తున్న శర్వానంద్ ఒక చక్కటి ఫ్యామిలీ స్టోరీ తో ప్రేక్షకులను కనువిందు చెయ్యడానికి వస్తున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. 'శతమానం భవతి'పై ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతె దిల్ రాజు ఇలా ఇద్దరు పెద్ద హీరోల మధ్యలో కాలు పెడుతున్నాడో అని ప్రతి ఒక్క సగటు ప్రేక్షకుడు ఆలోచించేలా చేయగలిగాడు రాజు. ఎలాగూ చిరు 'ఖైదీ...' మాస్ ఎలివెంట్స్ ఉన్న మూవీ కావడం, బాలయ్య 'గౌతమి....' చారిత్రక నేపధ్యం వున్న మూవీ కావడంతో శర్వా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
ఇక 'శతమానం భవతి' ట్రైలర్ ని విడుదల చేశారు ఈ ట్రైలర్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రకాష్ రాజ్, జయసుధలు ఒక పండక్కి తమ పిల్లల్ని పిలవాలని అనుకుంటారు. ఇక అమెరికా నుండి ఇంద్రజ తన కూతురు అనుపమ పరమేశ్వర్ తో పాటు ఆ విలేజ్ లో కాలు పెడుతుంది. ఇక అక్కడ పొలాల గట్ల మధ్యన బావ మరదళ్ల ప్రేమ కథగా, ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా శర్వానంద్, అనుపమల ప్రేమను చూపిస్తూ గ్రామీణ అందాలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ వేగేశ్న శతీష్. ఇక ఒక చక్కటి కుటుంబమంతా కలిసి ఒక పండుగను ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారో అలా కుటుంబమంతా పూజలు పునస్కారాలతో ఈ ట్రైలర్ ని నింపేశారు.
ఇక ఈ 'శతమానం భవతి' ట్రైలర్ లో మరో విశేషం ఏమిటంటే ఈ ట్రైలర్ లో దిల్ రాజు మెరవడం. దేవుడి పల్లకి మోసే మనుషుల్లో దిల్ రాజు కూడా 'శతమానం భవతి' చిత్రంలో సందడి చేసినట్టు ఈ ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. మరి దిల్ రాజుకి ఎంత ఇంట్రెస్ట్ లేకపోతె ఇందులో అలా ఒక చిన్న పాత్రని చేసాడో? లేక సినిమాలో ఇంకా ఎక్కడైనా కనబడతాడో? అనే సస్పెన్స్ ని మాత్రం క్రియేట్ చేశారు 'శతమానం భవతి' చిత్ర యూనిట్ వాళ్ళు. అయితే ఈ ట్రైలర్ లో మాత్రం దిల్ రాజు కనికనబడనట్టు కనిపించాడు. మరి ఈ 'శతమానం భవతి' చిత్రం సంక్రాతి కానుకగా ఈ నెల 14న విడుదలవుతుంది.