పవన్, మహేష్, బన్నీ, ఎన్టీఆర్, చరణ్... ఇలా యంగ్‌స్టార్స్‌తో పాటు సీనియర్ స్టార్స్ అయిన చిరు, బాలయ్య, నాగ్, వెంకీ వంటి వారి చిత్రాల విషయంలో కూడా వస్తున్న పలు వార్తల పట్ల విమర్శకులు మండిపడుతున్నారు. తమ చితం ట్రైలర్‌కు లేదా ఫస్ట్‌లుక్‌కు ఇన్ని వ్యూస్ వచ్చాయని, అలాగే ఆయా హీరోల చిత్రాల ప్రీరిలీజ్ బిజినెస్‌లపై వస్తున్న వార్తలను కూడా వారు ఖండిస్తున్నారు. ఇప్పటికీ చిరు, బాలయ్య వంటి సీనియర్ స్టార్స్‌కు ఎలాంటి ఆదరణ ఉంటుందో లేదో అర్ధంకాని పరిస్థితులు నెలకొన్నాయని, కానీ వారి చిత్రాల ప్రీరిలీజ్ బిజినెస్‌లు వందకోట్లు దాటాయంటూ తప్పుడు ప్రచారం మొదలవ్వడం ఇండస్ట్రీకి ఎన్నో ఇబ్బందులను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. దాదాపు 9ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న చిరు 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' ద్వారా ఆయన మరలా ప్రేక్షకులను ఆ స్థాయిలో ఆకట్టుకోగలడా? ఒక హిట్ మూడూ ఫ్లాప్‌లతో అల్లాడుతున్న బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి చిత్రం బాగున్నా.. కలెక్షన్లు ఆశించిన స్థాయిలో ఉంటాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ, 'ఖైదీ' చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ 100కోట్లు దాటిందని, ఆ పాటలకు ఇన్ని వ్యూస్ వచ్చాయని, శాటిలైట్ రైట్స్ 14కోట్లకు అమ్ముడుపోయాయని, ఓవర్‌సీస్‌హక్కులు 14కోట్లు, నైజాం రైట్స్ 9కోట్లు అంటూ జరుగుతున్న ప్రచారం చూస్తే నవ్వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక బాలయ్య చిత్రానికి, నాగ్ 'ఓం నమో వేంకటేశాయ'కు, వెంకీ 'గురు' చిత్రాలకు కూడా ఇలాంటి అసత్యప్రచారం జరుగుతోందంటున్నారు. నల్లధనంపై మోదీ ఉక్కుపాదం మోపిన తర్వాత పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని, కాబట్టి వీటి విషయంలో వస్తున్న లెక్కలన్నీ బోగస్ అని తేల్చేస్తున్నారు. ఇక ఒకప్పటీలా ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ ఎంత పెద్ద స్టార్ చిత్రమైనా ఆచితూచి అడుగులు వేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో వారు కోట్లకుకోట్లు బెట్టింగ్ కాసే సీన్‌లేదని, బాలయ్య నటించిన 'పరమ వీరచక్ర'తో పాటు పలు టాప్‌హీరోల కొన్ని చిత్రాలు కూడా ఇప్పటికీ శాటిలైట్ హక్కులు అమ్ముడుపోని విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇటీవల సినీ ఫీల్డ్‌లోని వారిపై, ముఖ్యంగా పబ్లిసిటీ, అంచనాల కోసం కాకిలెక్కలు చెబుతున్న నిర్మాతలపై ఐటి దాడులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని, కాబట్టి ఇదే పోకడను మానుకోకపోతే, రాబోయే కాలంలో నిర్మాతలు ఆదాయపన్ను లెక్కల విషయంలో బుక్ అయిపోవడం ఖాయమంటున్నారు. వారి వాదన విన్న వారికి ఇది నిజమే అని అనిపించకమానదు.