ప్రతి శుక్రవారం సినిమాలు విడుదల కావడం సహజమే. కానీ రేపటి శుక్రవారానికి మాత్రం ప్రత్యేకత ఉంది. 2016వ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోయే చివరి శుక్రవారం ఇదే. మరి ఏ చిత్రం ఈ ఏడాదికి ఘనమైన ముగింపునిస్తుందో అని ఎందరో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. అల్లరినరేష్ నటించిన 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం', నారారోహిత్ నటిస్తున్న 'అప్పట్లో ఒకడుండేవాడు'తో పాటు 'కారందోశ','నేనొస్తా' చిత్రాలు విడుదల కానున్నాయి. మరోపక్క 'అసాసిన్స్' అనే హాలీవుడ్ మూవీ కూడా రిలీజవుతోంది. మోహన్‌లాల్ నటించిన మలయాళ సూపర్‌హిట్‌చిత్రం 'ఒప్పం' తెలుగు డబ్బింగ్ 'కనుపాప' చిత్రం కూడా ఇదే రోజున విడుదలవుతుందని చెప్పినప్పటికీ ప్రస్తుతం ఆ ఊసే లేదు. కాగా రేపు విడుదల కాబోయే చిత్రాలలో అందరి చూపు అల్లరినరేష్ నటించిన 'ఇంట్లోదెయ్యం...నాకేం భయం', నారారోహిత్ 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలపైనే ఉంది.
భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత కావడం, గతంలో అల్లరినరేష్‌కు రెండు కామెడీ హిట్స్‌ను ఇచ్చిన హాస్యచిత్రాల స్పెషలిస్ట్ దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడం, హర్రర్‌కామెడీ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న రోజులు కావడం అనేవి 'ఇంట్లో దెయ్యం..నాకేంభయం' చిత్రానికి ఉన్న ప్లస్ పాయింట్స్. ఇక వైవిధ్యభరితమైన చిత్రాలను మాత్రమే చేస్తాడన్న మంచి ఇమేజ్ ఉన్న నారారోహిత్ నటిస్తున్న చిత్రం కావడం, తన తొలి చిత్రంతోనే అందరినీ మెప్పించిన యువదర్శకుడు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం, వాస్తవిక ఘటనలతో రూపొందుతున్న మూవీ కావడం వంటి వాటితో పాటు నారారోహిత్ ఈ చిత్రాన్ని స్వయంగా సమర్పిస్తుండటం, 'జ్యో అచ్యుతానంద' వంటి హిట్ చిత్రం తర్వాత వస్తున్న రోహిత్ చిత్రం కావడం 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రానికి హైలైట్ కానున్నాయి. కాగా ఈ రెండు చిత్రాలకు ఫిల్మ్‌నగర్ ఇన్‌సైడ్ టాక్ పాజిటివ్‌గా ఉండటం మరో విశేషం. మరోపక్క 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' చిత్రం నరేష్ కెరీర్‌కు అత్యంత కీలకం కావడం గమనార్హం. మరి ఈ రెండు విభిన్న జోనర్స్‌లో వస్తున్న చిత్రాలలో ప్రేక్షకులు ఏ చిత్రానికి పట్టం కడుతారో వేచిచూడాల్సివుంది....!